Israel-Intelligence-Help-Saudi : సౌదీకి హౌతీల దెబ్బ Andhra Prabha Top Story
Israel-Intelligence-Help-Saudi : సౌదీకి హౌతీల దెబ్బ Andhra Prabha Top Story
- ఇజ్రాయెల్ సాయం కోసం ఎదురుచూపులు
- యెమెన్ సంక్షోభంలో రియాద్‌కు కొత్త చిక్కులు
- బాబ్ ఎల్-మందెబ్ జలసంధిపై హౌతీల పట్టు
- నిఘా సమాచారం కోసం
- ఇజ్రాయెల్‌ను ఆశ్రయించిన సౌదీ?
( దుబాయ్, ఆంధ్రప్రభ ప్రతినిధి )
యెమెన్‌లో హౌతీల దూకుడుతో సౌదీ అరేబియా ఉక్కిరి బిక్కిరవుతోంది. ఎర్ర సముద్ర తీరం, వ్యూహాత్మక బాబ్ ఎల్-మందెబ్ జలసంధిపై హౌతీలు పట్టు సాధించడంతో రియాద్ ఆందోళనలో పడింది. సౌదీకి మిత్రదేశాలుగా ఉన్న దేశాలు నేరుగా రంగంలోకి దిగేందుకు వెనుకాడుతుండటంతో.. అసలు గుర్తింపే ఇవ్వని ఇజ్రాయెల్ వైపు కూడా సౌదీ చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. హౌతీల ముప్పును ఎదుర్కొనేందుకు నిఘా సమాచార సహాయం అందించాలని ఇజ్రాయెల్‌ను సౌదీ కోరినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు?
టెల్‌అవీవ్‌కు చెందిన జెరూసలేం పోస్ట్ కథనం ప్రకారం.. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. హౌతీ మిలిటెంట్ల నుంచి తమకు ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు సౌదీకి నిఘా సమాచారం అందించే అంశంపై ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ హయోమ్ కథనం ప్రకారం.. సౌదీ యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) హౌతీల దాడులను ఎదుర్కొనేందుకు ఇతర గల్ఫ్ దేశాలు, ఈజిప్టు నుంచి కూడా సాయం కోరారు. బాబ్ ఎల్-మందెబ్ జలసంధికి సంబంధించిన ముప్పులపై నిఘా సమాచారాన్ని అందించాలని ఎంబీఎస్ పరోక్షంగా ఇజ్రాయెల్‌ను కోరినట్టు సమాచారం. ఇందుకోసం సెంట్కామ్ మార్గాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌తో మాటల్లేవు
సౌదీ అరేబియా ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో హౌతీల ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ నుంచి సాయం కోరాల్సిన పరిస్థితి రావడం.. యెమెన్‌లో రియాద్ ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీకి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. యెమెన్‌లోని హౌతీలపై అమెరికా, బ్రిటన్ నేరుగా దాడులకు దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. అమెరికా నిఘా సహాయం అందిస్తుండగా.. బ్రిటన్ సైనిక సలహాదారులను పంపే ప్రతిపాదనతో ముందుకొచ్చింది.
సౌదీ భూభాగానికే రక్షణ.. పాక్ స్పష్టీకరణ
సౌదీ, టర్కీలతో కలిసి మక్కా రక్షణ కూటమిలో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్ కూడా యెమెన్‌లో హౌతీలపై పోరాడేందుకు తమ సైనిక వనరులను పంపబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే సౌదీ భూభాగంపై దాడులు జరిగితే రక్షణ కోసం తమ బలగాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇస్లామాబాద్ తేల్చిచెప్పింది. విదేశీ గడ్డపై నేరుగా యుద్ధంలో పాల్గొనడం మాత్రం తమకు అంగీకారం కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
సౌదీకి సంక్షోభం ఎందుకు?
కొంతకాలంగా సౌదీ ఇంధన మౌలిక వసతులపై హౌతీలు అడపాదడపా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్నారు. అయితే గత వారం యెమెన్‌లో హౌతీలు అనూహ్యంగా భారీ దాడికి దిగారు. సౌదీ మద్దతుతో పనిచేస్తున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ బలగాలను వెనక్కి నెట్టి.. రెడ్ సీ తీర ప్రాంతంతో పాటు బాబ్ ఎల్-మందెబ్ జలసంధిలోని కొన్ని దీవులపై కూడా నియంత్రణ సాధించినట్టు సమాచారం.దీంతో సౌదీకి చెందిన నౌకలపై జులై నుంచి కొనసాగుతున్న ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తామని హౌతీ నాయకత్వం ప్రకటించింది. ఇతర దేశాలకు చెందిన నౌకలకు మాత్రం.. అమెరికా సహా.. ఈ మార్గంలో రాకపోకలకు అనుమతి ఉంటుందని తెలిపింది.
‘గేట్స్ ఆఫ్ టియర్స్’ మూసివేతతో ముప్పు
బాబ్ ఎల్-మందెబ్‌ను ‘గేట్స్ ఆఫ్ టియర్స్’ అని కూడా పిలుస్తారు. ఈ జలసంధి మూసివేత సౌదీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముంది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఎప్పుడైనా దిగ్బంధం విధిస్తే.. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశం సౌదీకి ఉండేది. ఇప్పుడు ఆ మార్గంపైనా హౌతీల పట్టు బిగుస్తుండటం రియాద్‌కు ఆందోళన కలిగిస్తోంది.దీనికి తోడు సౌదీ విస్తృత పైప్‌లైన్ నెట్‌వర్క్‌పై దాడులు జరిగితే.. దేశం నుంచి చమురు ఎగుమతులు భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పరిస్థితి మరింత ముదిరితే చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయే స్థాయికి చేరుకోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇజ్రాయెల్‌కూ గతంలో ఇదే అనుభవం
హౌతీల నుంచి ఎదురవుతున్న ముప్పు ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు. 2023 చివర్లో గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత.. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో సముద్ర రవాణాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే సౌదీకి ఇజ్రాయెల్ నుంచి సాయం లభించినా అది ప్రధానంగా నిఘా సమాచారానికే పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీలు రాకెట్ దాడులకు దిగే ప్రమాదం, మరోవైపు ఎర్ర సముద్రంలో కొత్తగా ఏర్పడే దిగ్బంధం వల్ల ఆర్థికంగా కలిగే నష్టం వంటి అంశాలపై ఇజ్రాయెల్‌లో ఆందోళనలున్నట్టు హయోమ్ పేర్కొంది. హౌతీలపై ఇజ్రాయెల్ చర్యలకు దిగాల్సి వస్తే ఒంటరిగా కాకుండా విస్తృత అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధికారులు సూచించినట్టు హారెట్జ్ తెలిపింది.
మొత్తంగా చూస్తే.. యెమెన్‌లో హౌతీల దూకుడు సౌదీకి సైనిక సమస్యగానే కాకుండా చమురు ఎగుమతులు, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన పెను సవాలుగా మారుతోంది. తమకు అధికారిక మిత్రదేశం కాని ఇజ్రాయెల్ నుంచి సైతం నిఘా సహాయం కోరాల్సిన పరిస్థితి రావడం ఈ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది.
