ఐసర్‌ తిరుపతి, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం సంయుక్త పీహెచ్‌డీ ప్రవేశాలు

అక్టోబర్‌ 15 దరఖాస్తులకు చివరి గడువు

ఏర్పేడు, ఆంధ్రప్రభ : తిరుపతి ఐసర్‌ (భారతీయ సైన్స్‌ విద్య, పరిశోధనా సంస్థ), ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించే పీహెచ్‌డీ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. మెల్‌బోర్న్‌ ఇండియా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి పరిశోధన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు, ఉపగ్రహ సమాచారంతో కూడిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యా మార్పులు, క్షయ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాపై జీవక్రియ అధ్యయనం వంటి అంశాల్లో పరిశోధనలకు అవకాశం కల్పించారు.

ఎంపికైన విద్యార్థులు తొలుత ఐసర్‌ తిరుపతిలో చేరి, మొదటి సెమిస్టర్‌లో 8.5 గ్రేడ్‌ సాధించాల్సి ఉంటుంది. అనంతరం వారు ఈ సంయుక్త పరిశోధన కార్యక్రమంలో కొనసాగవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐసర్‌ తిరుపతి సాధారణ పీహెచ్‌డీ ప్రవేశ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకుని, అందులో ఈ ప్రత్యేక ప్రాజెక్టును ఎంపిక చేసుకోవాలని సంస్థ తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్‌ 15 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చని పేర్కొంది.