తెలంగాణ ధనిక రాష్ట్రమా? లేక పెరుగుతున్న పేదరికమా..?

  • అనధికారిక పేదరికాన్ని చూపుతున్న అధికారిక లెక్కలు
  • ప్రభుత్వ ప్రకటనల్లో సంపన్న రాష్ట్రంగా కితాబు
  • కుటుంబాల సంఖ్య కోటి 17 లక్షలు
  • రేషన్‌ కార్డుల సంఖ్య కోటి 6 లక్షలు
  • 3.55 కోట్ల జనాభాలో 3.43 కోట్ల మంది పేదలే
  • వాస్తవికతకు ఆమడ దూరంలో లెక్కలు
  • సంక్షేమం పేరుతో దగా.. రేషన్‌ బియ్యం ప‌క్క‌దారి
  • అవసరానికి మించి పెరిగిపోయిన కార్డుల సంఖ్య
  • లబ్ధిదారుల్లో 25శాతానికి పైగా అనర్హులుండే ఛాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమ రంగం వక్రదారి పడుతోంది. దారిద్య్ర రేఖకు దిగువనుండే కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. వాస్తవ పరిస్థితులకు ఆమడ దూరంలో కనిపిస్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రజా ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియలో డొల్లతనం బహిర్గతమైంది. తెలంగాణాలో ఉన్న జనాభాకు, రేషన్‌ కార్డుల్లో లబ్ధి పొందుతున్న వారి సంఖ్యకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు.. అన్నీ కలిపి కుటుంబాల సంఖ్య కోటి 17 లక్షలు ఉండగా, రేషన్‌ కార్డుల సంఖ్య కోటి 6 లక్షలుగా ఉన్నట్లు లెక్కలున్నాయి.

తాజా సర్వేల ప్రకారం.. తెలంగాణాలో 3.55 కోట్ల జనాభా ఉండగా, అందులో 3.43 కోట్ల మంది పేదలే ఉన్నట్లు రేషన్‌ కార్డుల లభ్ధిదారుల సంఖ్యను బట్టి స్పష్టమవుతోంది. అంటే, రాష్ట్రంలో కేవలం 11 లక్షల మంది మాత్రమే రేషన్‌ కార్డులు లేకుండా ఉన్నారు. అనధికార అంచనాల ప్రకారం.. సరాసరిగా 15 లక్షల నుంచి 20 లక్షల మంది టాక్స్‌ పేయర్లున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా భూస్వాములు, అగ్రశ్రేణి, ధనిక వర్గాలకు చెందిన వారున్నట్లు సామాజిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

కానీ, రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు మాత్రం అనేక అనుమానాలకు, అపోహలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో అసలు తెలంగాణ ధనిక రాష్ట్రమా? లేక పేదరికంలో మగ్గుతున్న రాష్ట్రమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాష్ట్రమంతా 95శాతానికి పైగా పేదరికాన్ని చూపుతున్న అధికారిక లెక్కలు ఆందోళన కగిలిస్తున్నాయి. గతంలోనూ, ఇప్పుడూ అనేక సందర్భాల్లో ప్రభుత్వ ప్రకటనల్లో సంపన్న రాష్ట్రంగా నేతలు కితాబిచ్చిన విషయం తెలిసిందే. వాస్తవాలను పరిశీలిస్తే, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారాజ్యంగా రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో రేషన్‌ కార్డునే ప్రధాన కొలమానంగా పరిగణిస్తారు. పేదలకు కార్పొరేటు వైద్యం అందించే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంలోనూ రేషన్‌ కార్డు మాత్రమే ప్రామాణికం. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇలా ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా ఆయా సంక్షేమ శాఖల నుంచి విడుదలయ్యే రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహక నిధులు, స్కాలర్‌షిప్‌లు, భోదనా ఫీజులు ఇలా ప్రభుత్వ పరంగా అనేక కోణాల్లో ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. విదేశాలకు వెళ్లాలన్నా, ఉన్నత చదువులకు ఓవర్సీస్‌ స్కార్‌ఫిప్‌ రావాలన్నా రేషన్‌కార్డు ఉంటే చాలు. ఆ వర్గాలకు రెవెన్యూ ఇతర శాఖల నుంచి అల్పాదాయ ధృవీకరణ పత్రాలు కూడా మంజూరు చేస్తారు. దీంతో పెద్దమొత్తంలో ప్రజాధనం అనర్హులకు అందుతోందన్న ఆందోళణ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు కేవలం సంక్షేమ రంగంపైనే కాదు.. మిగతా అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అనర్హులకు సంక్షేమ ఫలాలు అందుతుండడంతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోంది.

వాస్తవికతకు ఆమడ దూరంలో లెక్కలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమం పేరుతో దగా జరగుతోందని, రేషన్‌ బియ్యం వక్రదారి పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరానికి మించి పెరిగిపోయిన కార్డుల సంఖ్యతో పేదరికం కనిపిస్తోంది కానీ, దాని వెనక రాజకీయ కోణం, నేతల భవిష్యత్తు వ్యూహం దాగి ఉందన్న విషయం కూడా స్పష్టమవుతోంది. లబ్ధిదారుల్లో సరిసరిగా 25శాతానికి పైగా అనర్హులుండే అవకాశం ఉంది. వాస్తవ పరిస్థితులకు, అధికారిక లెక్కలకు పొంతన లేకుండా పోతోన్న సందర్భంలో ప్రభుత్వం స్పందించాలని, అర్హులకు మాత్రమే ప్రజాధనం ఖర్చయ్యేలా చూడాల్సిన బాద్యత పాలకులపై ఉందని సామాజిక విశ్లేషకులు, ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేషన్‌ కార్డులు చెబుతున్న నిజం ఆధారంగా తక్షణ చర్యలకు పూనుకోవాలన్న డిమాండ్‌ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా 3 కోట్ల 55 లక్షలు ఉంటే, రేషన్‌ పొందే జనాభా 3.43 కోట్లు-గా ఉంది. అయితే, తెలంగాణ రిచ్‌ స్టేట్‌ ఎలా ఉవుతుందన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది. సర్కారు డేటా చెబుతున్నది నిజమా? పాలకులు చెబుతున్నది నిజమా? అన్న అంశంపై సమాజంలో స్పష్టత కనిపించడం లేదు. రేషన్‌ కార్డ్‌ పేదల కోసమా? లేక ఓట్లు- రాబట్టడం కోసమా? అని సామాజికవేత్తలు నిలదీస్తున్నారు.

అధిక ఆదాయవర్గాలకు చెందిన వారు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వార్షిక ఆదాయంపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (ఐటీ) కట్టే వారి చేతిలోనూ రేషన్‌ కార్డులున్నట్లు ప్రభుత్వ లెక్కల్లోనే స్పష్టమవుతుడడం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వ్యాపారస్తుల చేతిలో తెల్ల కార్డులుండడమేమిటన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. పేద వర్గాలను గుర్తించే కార్డుల ద్వారా ఇచ్చే బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంగా ఏటా సరాసరిగా రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. పేదరిక నిర్మూలన, ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంలో అమలు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా అందజేస్తున్న బియ్యం పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయి. 25-30 శాతం మంది నెలనెలా రేషన్‌ బియ్యం తీసుకోలేని వారున్నారు. ఇకవేళ తీసుకున్న కుటుంబాలు కూడా వెంటనే ఆ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం రాజకీయ కోణంలో ‘అన్ని కార్డులు ఇచ్చాం.. ఇన్ని కార్డులు ఇచ్చాం’ అని గొప్పలు చెబుతున్న వైనం నిత్యం సమాజంలో కనిపిస్తూనే ఉంది. రేషన్‌ కార్డులు ఎక్కువగా ఉంటే, ఆ రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్‌) జనం ఎక్కవగా ఉన్నారని ప్రభుత్వాలు నిర్థారణ చేస్తాయి.

పేదలు ఉన్నారని ఓ వైపు చెబుతూ, మరో వైపు ధనిక తెలంగాణ అని చెప్పడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న జనమంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే, ధనిక తెలంగాణ ఎలా అవుతుంది? అన్నదే అసలు ప్రశ్న. రేషన్‌ కార్డ్‌ అవసరం లేకున్నా వెనకబడి ఉన్నామని చూపేందుకు కొందరు, పిల్లల చదువుల కోసం అవసరం అయ్యే ఆదాయ ధ్రువపత్రాల కోసం మరికొందరు దరఖాస్తు చేస్తుండడంతో డిమాండ్‌ పెరిగిపోయింది. రేషన్‌ కార్డ్‌కు, ఆదాయ ధృవీకరణ పత్రాలకు లింక్‌ తీసేస్తే కార్డుల డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందని నిపుణలు సూచిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు బియ్యం ఎక్కవ ఇచ్చినా వారు తింటారు, అవసరం లేని వారి చేతిలో కార్డులుంటే ఖజానాకు గండి పడడం ఖాయమన్న భావన వాస్తవాలను స్పష్టం చేస్తోంది. నిఘా వైఫల్యంతో ప్రతినెలా సరఫరా చేసే రేషన్‌ బియ్యం అన్నీ బ్లాక్‌ మార్కెట్‌కే చేరుతున్నాయి. సన్న బియ్యం వచ్చాక పెరిగిన రేట్‌కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇచ్చిన గంటలోనే అమ్మేసుకుంటున్న అనేక మంది లబ్ధిదారులను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. రేషన్‌ కార్డులపై జారీపై రీ సర్వే అత్యవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.