కలెక్టర్ సార్.. మా గోడు వినరా!
జిల్లా కలెక్టర్ సార్.. మా గోడు వినరా!
సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు అందని సాగునీరు
భూములిచ్చినా ఫలితం శూన్యం.. ఎండిన పొలాల్లో పశువుల మేత!
పిచ్చిమొక్కలు, మట్టితో నీటి ప్రవాహానికి అడ్డంకులు..
చివరి ఆయక ట్టు వరకు నీరందించాలని రైతుల వేడుకోలు
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 12, ఆంధ్రప్రభ: పంటలు పండాల్సిన పొలాల్లో పశువులు మేస్తున్నాయి.. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన చేలు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన రైతన్నకు చివరికి కన్నీళ్లే మిగులుతు న్నాయి. సాగునీరు అందుతుందనే ఆశతో ఎల్-2 కాలువ నిర్మాణానికి భూములిచ్చిన అన్నదాతలకు నేటికీ ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉన్నా.. కాలువ అందుబాటులో ఉన్నప్పటికీ చేల వరకు నీరు చేరడం లేదు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు కళ్లముందే వృథా అవుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగునీరు అందించాల్సిన కాలువ ఉన్నా.. పంటలకు నీరు అందక, చివరికి పశువుల మేతగా పొలాలు మారుతున్న దుస్థితి నెలకొంది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లిలో నెలకొన్న ఈ పరిస్థితి రైతుల సాగునీటి కష్టాలకు అద్దం పడుతోంది.
భూములిచ్చినా.. సాగునీరు ఏదీ?
కాలువ నిర్మాణం కోసం భూములిచ్చినప్పుడు తమ పొలాలకు సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆశించారు. అయితే ఏళ్లు గడుస్తు న్నా ఆశించిన ప్రయోజనం అందడం లేదని వాపోతున్నారు. సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు నీరందకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు బోర్లలో నీరు అందకపోవడంతో పంట లను కాపాడుకోవడం కష్టంగా మారింది. సాగు కోసం పెట్టిన పెట్టుబ డులు వృథా అవుతుండగా, చేతికొస్తుందనుకున్న పంట కళ్లముందే ఎండిపోతోంది. పంటలు పండాల్సిన పొలాల్లో పశువులు మేస్తుండటం తో తమ శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలో పిచ్చిమొక్కలు.. నీటి ప్రవాహానికి అడ్డంకులు
పొలాల పక్కనే ఉన్న ఎల్-2 కాలువలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగా యి. పలుచోట్ల మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు. కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొంటున్నారు. కాలువ అందుబాటులో ఉన్నప్పటికీ సాగునీరు అందక పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికందకపోతే అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు. ఇలాగే కొనసాగితే వ్యవసాయాన్ని వదిలి వలస వెళ్లా ల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ సార్.. మా గోడు వినరా!
తానేదార్‌పల్లిలో సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంద క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తక్షణ మే స్పందించాలని అన్నదాతలు కోరుతున్నారు. సంబంధిత నీటిపా రుదల శాఖ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి, ఎల్-2 కాలు వను క్షేత్రస్థాయిలో పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తు న్నారు. కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, మట్టిని తొలగించి, నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను నివారించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అవసరమైన మరమ్మతులు చేపట్టి సాగునీరు అందేలా జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులతో తక్షణ చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
అప్పులు చేసి పంటలు సాగు చేశాం: గాదె మనిల, తానేదార్‌పల్లి రైతు
ఎల్-2 కాలువ కోసం భూములిచ్చాం.. మా పొలాలకు సాగునీరు అందుతుందని ఆశపడ్డాం. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశాం. తీరా చూస్తే కాలువలో నీరు లేదు.. బోర్లలోనూ నీరు రావ డం లేదు. మా పొలాలకు సాగునీరు అందడం లేదు. కళ్లముందే పంట లు ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నాం. చివరికి పంటలు పండాల్సి న పొలాల్లో పశువులు మేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందిం చి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, కాలువలో నీరు పారించి మా పంటలను కాపాడాలి.
