Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై పకడ్బందీ ఏర్పాట్లు…
Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై పకడ్బందీ ఏర్పాట్లు…
- ప్రశాంతంగా అమ్మ దర్శనం
- సామాన్య భక్తులకే పెద్దపేట..
- భక్తులకు సకల సౌకర్యాలు!
- శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..
- అడుగడుగునా భక్తి.. అంతటా సౌకర్యాలు
- హోల్డింగ్ ప్రాంతాల్లోనే దర్శన సమయం..
- తెరలపై ఎప్పటికప్పుడు సమాచారం
- మూడు హోల్డింగ్ ప్రాంతాలు..
- 30 లక్షల లీటర్ల తాగునీటి ఏర్పాట్లు
- భక్తులకు మజ్జిగ.. అల్పాహారం.. అన్నప్రసాదం..
- ఉచితంగా 20 గ్రాముల లడ్డూ..
- భక్తుల కోసం 60 లక్షల లడ్డూలు సిద్ధం..
- అమ్మ దర్శనానికి సులువైన మార్గం..
- రద్దీని బట్టి క్యూల్లో మార్పులు
- అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా..
- సాంకేతికతతో భక్తుల కదలికలపై పర్యవేక్షణ
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : శక్తి స్వరూపిణి.. జగజ్జనని.. భక్తుల కొంగుబంగారమైన శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి వైభవానికి సిద్ధమవుతోంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ‘అమ్మ దరి చేరే ప్రతి అడుగూ సులభంగా.. ప్రతి క్షణం భక్తిమయంగా’ ఉండేలా దేవస్థానం పకడ్బందీ ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే వేళ గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి లేకుండా హోల్డింగ్ ప్రాంతాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, సమాచార తెరలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక దర్శన మార్గాలను సిద్ధం చేస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో అమ్మ దర్శనం….
భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఇప్పటికే ఉన్న రెండు హోల్డింగ్ ప్రాంతాలకు అదనంగా పూల మార్కెట్ సమీపంలో మరో హోల్డింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేస్తున్నారు. రైలు, బస్సుల్లో వచ్చే భక్తులు తొలుత హోల్డింగ్ ప్రాంతాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రద్దీని బట్టి వినాయక ఆలయం వైపు దర్శన క్యూలోకి పంపిస్తారు. హోల్డింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ తెరలపై “అమ్మ దర్శనానికి ఇంకా ఎంత సమయం.. క్యూలో ఎంతమంది.. ఆలయంలో ఎంత రద్దీ” అన్న వివరాలు ఎప్పటికప్పుడు కనిపించేలా చేస్తారు. మైకుల ద్వారా కూడా సమాచారాన్ని అందిస్తారు. భక్తులు నిరీక్షించే సమయంలో అమ్మవారి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెరలపై వీక్షించే అవకాశం కల్పిస్తారు.
క్యూ కాదు.. క్రమబద్ధమైన దర్శన యాత్ర…
వినాయక ఆలయం నుంచి మసీదు, టోల్‌గేట్, ఓం టర్నింగ్, చిన్నరాజగోపురం మీదుగా అమ్మవారి సన్నిధికి భక్తులు చేరుకుంటారు. దర్శనం అనంతరం శివాలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి రాయబార మండపం, మహామండపం షెడ్డు మీదుగా కనకదుర్గనగర్ వైపు భక్తులు బయటకు వెళ్లేలా మార్గాన్ని సిద్ధం చేశారు. రద్దీ పెరిగితే హోల్డింగ్ ప్రాంతమే భక్తులకు ఆధారం అన్న విధంగా పరిస్థితులకు అనుగుణంగా దర్శన మార్గాలను మార్చనున్నారు.

వి ఐ పీ లకు రోజుకు 500 టికట్స్
తిరుమల తరహాలో రోజుకు 500 వీఐపీ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం నుంచి టికెట్ల విడుదల ప్రారంభించి, ఒక్కసారి అవకాశం దక్కని భక్తుడికి మరోసారి అవకాశం లభించేలా విధానం రూపొందించినట్లు ఈవో తెలిపారు. కుమారపాలెంలోని టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సుల్లో టికెట్ పొందిన భక్తులను తీసుకొచ్చి దర్శనం చేయిస్తారు. ప్రతిరోజు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటల పాటు వీఐపీ దర్శనాలకు అధికారులు అనుమతిస్తారు. రద్దీని బట్టి దర్శన స్లాట్లను మార్చే వెసులుబాటు ఉంచారు.
ఆర్జిత సేవ.. ఆపై అమ్మవారి దర్శనం..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీహోమం, ఖడ్గమాల సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాలమైన ఏసీ సౌకర్యం కలిగిన పూజా మందిరాన్ని సిద్ధం చేశారు. ఆర్జిత సేవ పూర్తయ్యాక భక్తులను ప్రత్యేకంగా తీసుకువచ్చి స్కానింగ్ చేసి ముఖమండప దర్శనం కల్పిస్తారు. అమ్మవారి సన్నిధిలో పూజ చేసుకునే అవకాశం.. ఆపై అమ్మవారి ముఖదర్శనం కల్పించేలా విధానాన్ని రూపొందించారు.

మూలా నక్షత్రం రోజు ‘సర్కారు వారి సేవ’…
ఈ నెల 16న మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఆ రోజు సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యక్ష ఆర్జిత సేవలను నిర్వహించరు. అర్చకుల ద్వారా పరోక్షంగా సేవలు నిర్వహించి భక్తుల గోత్రనామాలను చదివిస్తారు. ఈ సేవను సర్కారు వారి సేవ గా నిర్వహించి ఆన్‌లైన్, యూట్యూబ్ ద్వారా భక్తులకు వీక్షించే అవకాశం కల్పిస్తారు.
వాటర్ బబుల్స్ ద్వారా త్రాగునీరు…
అమ్మ దర్శనానికి వచ్చే భక్తుల దాహం తీర్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 50 ప్రాంతాల్లో వాటర్ బబుల్స్ ఏర్పాటు చేసి సుమారు 30 లక్షల లీటర్ల తాగునీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. హోల్డింగ్ ప్రాంతాల్లో తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఎక్కువసేపు నిరీక్షించాల్సి వస్తే ఉప్మా, టమాటా బాత్, పెరుగు అన్నం, సాంబార్ రైస్, పొంగలి వంటి ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అన్నప్రసాదం.. అమ్మ ప్రసాదంలా..
దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీని బట్టి కింది, పై అంతస్తుల్లో బఫే ఏర్పాటు చేయనున్నారు. లడ్డూ ప్రసాదం కోసం కౌంటర్లను పెంచడంతో పాటు కొత్త ఆర్జిత సేవా కేంద్రం వద్ద నాలుగు ఎటిఎం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీఐపీ డోనర్ లాంజ్ వద్ద కూడా ప్రత్యేక ఎటిఎం కౌంటర్ ఉంటుంది. 20 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందించనున్నారు.
అమ్మ సన్నిధిలో అడుగడుగునా నిఘా…
భక్తుల భద్రత, సౌకర్యాల కోసం విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎంతసేపు వేచి ఉన్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతోంది? వంటి వివరాలను సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. చిన్నారులు తప్పిపోకుండా గుర్తింపు బ్యాండ్లు అందిస్తారు.
ప్రత్యేక గుర్తింపు కార్డులు..
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వహించే దేవస్థాన సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బందికి ముందుగానే విధులను కేటాయించి గుర్తింపు కార్డులు అందిస్తారు. ఫేస్ రికగ్నిషన్ ఆధారిత ప్రవేశ విధానాన్ని అమలు చేయనున్నారు. అనుమతించిన వాహనాలకే కొండపైకి ప్రవేశం ఉంటుంది. మీడియా కు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులతో పాటు పరిమిత సంఖ్యలో అనుమతిని ఇవ్వనున్నారు.

సంతృప్తిగా అమ్మ దర్శనం…
“అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడూ సంతృప్తిగా తిరిగి వెళ్లాలి. రద్దీ ఎంత ఉన్నా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయం ఉన్నత అధికారుల సూచనలతో భక్తుల సహకారంతో శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి కే శీనా నాయక్ తెలిపారు.
