Iran-War-Us-Strategy : అమెరికా పీచేముడ్ Andhra Prabha Top Story
Iran-War-Us-Strategy : అమెరికా పీచేముడ్ Andhra Prabha Top Story
- ఇరాన్ దెబ్బతో అంతర్మథనం
- సైనిక స్థావరాల కోతపై కసరత్తు
- స్థావరాల పునర్నిర్మాణంపై సందిగ్దత
- గల్ఫ్ దేశాలకే రక్షణ బాధ్యత
- 50 వేల సైనికులు వెనక్కి
- అమెరికా నయా వ్యూహం
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్)
ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ అమెరికా మధ్యప్రాచ్య వ్యూహంపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులతో అమెరికా సైనిక స్థావరాలు, గూఢచార వ్యవస్థలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో తమ సైనిక, నిఘా మౌలిక వసతులను తగ్గించే అంశంపై అమెరికా సైనిక, గూఢచార వర్గాల్లో అనధికారిక చర్చలు జరుగుతున్నట్లు ఆరు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక నిర్ణయం వెలువడలేదు.
9/11 తర్వాత భారీ విస్తరణ
2001 సెప్టెంబరు 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక, గూఢచార వ్యవస్థను గణనీయంగా విస్తరించింది. ఇరాక్, అఫ్గానిస్థాన్, సిరియా, ఇరాన్, యెమెన్, లిబియా తదితర ప్రాంతాల్లో శాశ్వత, తాత్కాలిక స్థావరాలు ఏర్పాటయ్యాయి. ఒక దశలో ఈ ప్రాంతంలో అమెరికా సైనికుల సంఖ్య భారీగా పెరిగింది.
2003లో ఇరాక్‌పై అమెరికా దాడి సమయంలో సుమారు 2.5 లక్షల మంది సైనికులు అక్కడ ఉన్నారు. 2007 నుంచి 2011 మధ్య కూడా ఈ సంఖ్య లక్షకు తగ్గకుండా కొనసాగింది. ఆ తర్వాత అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా బలగాలను క్రమంగా తగ్గించే ప్రక్రియను ప్రారంభించారు. ఇరాక్ నుంచి యుద్ధ బలగాలను ఉపసంహరించినప్పటికీ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పెరుగుదలతో అమెరికా మళ్లీ ఆ ప్రాంతంలోకి రావాల్సి వచ్చింది.
50 వేల మంది సైనికులు
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికాకు సుమారు 50 వేల మంది సైనికులు ఉన్నారు. రెండు విమాన వాహక నౌకలు, 12కు పైగా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు అక్కడ మోహరించి ఉన్నాయి. ఇరాన్‌తో ఘర్షణ నేపథ్యంలో గతంలో స్వదేశానికి పంపిన కొంతమంది సీఐఏ అధికారులు కూడా తిరిగి ఈ ప్రాంతానికి వస్తున్నారు. అయితే అదే సమయంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అమెరికా బలగాల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచనకు ప్రాధాన్యం పెరుగుతోంది.
బంకర్లలోకి స్థావరాలు?
ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులతో అమెరికా స్థావరాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. దీంతో కీలక సైనిక మౌలిక వసతులను మరింత పటిష్ఠం చేయడంతోపాటు.. కొన్ని ప్రాంతాల్లో స్థావరాలను భూగర్భంలోకి తరలించే అవకాశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యుద్ధం కొనసాగుతున్నంతకాలం కీలక వైమానిక స్థావరాలను పూర్తిగా వదిలివేసే పరిస్థితి ఉండదని సైనిక వర్గాలు భావిస్తున్నాయి.
పునర్నిర్మాణంపై సందిగ్ధత
ఇరాన్ దాడుల్లో జోర్డాన్, యూఏఈలోని అమెరికా స్థావరాలు, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్‌లోని సైనిక మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని సీఐఏ కేంద్రానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న ప్రతి స్థావరాన్ని తిరిగి అదే స్థాయిలో నిర్మించాలా? అనే ప్రశ్న తలెత్తింది. భారీ వ్యయంతో కూడుకున్న పునర్నిర్మాణాన్ని కొన్ని సందర్భాల్లో అమెరికా ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశమూ ఉందని అధికారులు చెబుతున్నారు.
గల్ఫ్ దేశాలకే రక్షణ బాధ్యత
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికిని కొంతమేర తగ్గించి.. ప్రాంతీయ దేశాలే తమ రక్షణ బాధ్యతలను మరింతగా చేపట్టేలా చేయాలన్న ఆలోచన పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి అమెరికా బలగాలను తగ్గించే అంశంపై పెంటగాన్‌లోని కొందరు సీనియర్ అధికారులు అంతర్గతంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ఫోర్స్ పోస్చర్ రివ్యూ గానీ, అధ్యక్షుడి నుంచి స్పష్టమైన ఆదేశాలు గానీ వెలువడలేదు.
ఇప్పుడే తేల్చని ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ, రక్షణ విధానాల్లో నిర్ణయాలను వేగంగా మార్చుకునే అవకాశం ఉండటంతో.. తదుపరి పరిణామాలపై అధికారుల్లోనూ స్పష్టత లేదని కథనం పేర్కొంది. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ.. ఆ ఒత్తిడి ఎప్పుడు ఫలితాన్నిస్తుందనే దానిపై స్పష్టమైన కాలపరిమితి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ కొన్ని నెలల పాటు ఆర్థిక ఇబ్బందులను భరించే అవకాశముందని, వెంటనే లొంగిపోయే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
బహ్రెయిన్‌కు వెళ్లేది ఎప్పుడో?
అమెరికా నౌకాదళానికి కీలక కేంద్రంగా ఉన్న బహ్రెయిన్‌లోని 5వ నౌకాదళ స్థావరానికి అమెరికా సిబ్బంది తక్షణమే తిరిగి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా నేవీ ఉన్నతాధికారి అడ్మిరల్ డారిల్ కాడిల్ కూడా.. అక్కడికి సిబ్బంది ‘త్వరలో తిరిగి వెళ్లే పరిస్థితి లేదని’ స్పష్టం చేసినట్లు కథనం పేర్కొంది. దీంతో ఇరాన్‌తో ఘర్షణ ముగిసిన తర్వాత కూడా గల్ఫ్‌లో అమెరికా సైనిక ఉనికిపై పునరాలోచన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
25 ఏళ్ల వ్యూహానికి మలుపు?
9/11 తర్వాత దాదాపు పావు శతాబ్దంగా మధ్యప్రాచ్యంలో అమెరికా చేపట్టిన సైనిక జోక్యాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇరాన్‌తో పరోక్ష ఘర్షణలు.. ఆ దేశాన్ని పదేపదే ఈ ప్రాంతంలోకి లాగాయి. ఇప్పుడు ఇరాన్ దాడులతో అమెరికా స్థావరాల భద్రత, వ్యయం, సైనికుల ప్రాణనష్టం వంటి అంశాలు మరోసారి తెరపైకి రావడంతో.. మధ్యప్రాచ్యంలో అమెరికా తన పాత వ్యూహాన్ని మార్చుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
