Iran-War-Us-Cost-365-Lakh-Crore : అమెరికా మూల్యం Andhra Prabha Top Story
Iran-War-Us-Cost-365-Lakh-Crore : అమెరికా మూల్యం Andhra Prabha Top Story
- రూ,3.65 లక్షల కోట్లు
- నెలకు మరో రూ.29,000 కోట్ల భారం
- 2027 తొలి మూడు నెలల్లో
- ద్రవ్యోల్బణం 0.5 శాతం ఖాయం
- ఆయుధ నిల్వలకు భారీ దెబ్బ..
- భర్తీకి ఐదేళ్లు పట్టే అవకాశం
- అమెరికా లబోదిబో
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్)
ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ఆరు నెలలుగా ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 38 బిలియన్ డాలర్లు ( రూ.3,64,774 కోట్లు) ఖర్చయినట్లు అమెరికా కాంగ్రెస్ నాన్‌పార్టిసన్ బడ్జెట్ కార్యాలయం వెల్లడించింది. యుద్ధం కొనసాగితే ప్రతి నెలా మరో 3 బిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
అదే సమయంలో ఈ యుద్ధ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా పడనుందని నివేదిక అంచనా వేసింది. 2027 తొలి మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 0.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పెరుగుతున్న ఇంధన ధరలు, యుద్ధ వ్యయం కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని తీసుకురావచ్చని వివరించింది.
ఆయుధ నిల్వలు అంతంతే
యుద్ధం కోసం అమెరికా భారీగా ఆయుధాలు, ముఖ్యంగా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే క్షిపణులను వినియోగిస్తోంది. దీంతో అమెరికా సైనిక ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గినట్లు కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం పేర్కొంది.
ప్రధానంగా మిసైల్ ఇంటర్సెప్టర్లు, ఇతర కీలక ఆయుధాల కొరత అమెరికా రక్షణ సన్నద్ధతపై ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం తగ్గిపోయిన ఆయుధ నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి ఐదేళ్ల వరకు సమయం పట్టొచ్చని అంచనా వేసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా తన దీర్ఘశ్రేణి ఖచ్చితత్వ క్షిపణుల్లో దాదాపు మొత్తం వినియోగించిన పరిస్థితి నెలకొంది.
మరో యుద్ధం వస్తే..?
ఆయుధ నిల్వలు తగ్గిపోవడం అమెరికా భద్రతా వ్యూహంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని CBO హెచ్చరించింది. ముఖ్యంగా భవిష్యత్తులో మరో పెద్ద సైనిక ఘర్షణ తలెత్తితే పరిస్థితి క్లిష్టంగా మారవచ్చని పేర్కొంది. చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధంగా మారిన పక్షంలో అమెరికా సైనికంగా స్పందించాల్సి వస్తే.. ప్రస్తుత ఆయుధ కొరత దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదిక వివరించింది.
యుద్ధ వ్యయం పరుగులు
జూలై 21న సెనేట్ విచారణ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించిన 37.5 బిలియన్ డాలర్ల వ్యయానికి తాజా లెక్కలు దాదాపు సమీపంలో ఉన్నాయి. ఆ తర్వాత కూడా యుద్ధం కొనసాగడంతో ఖర్చు 38 బిలియన్ డాలర్లకు చేరినట్లు CBO లెక్కించింది. అయితే ఇది పూర్తి లెక్క కాదని కూడా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులు, ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు సంబంధించిన ఖర్చులు ఇందులో చేర్చలేదు. అంతేకాదు.. యుద్ధానికి అవసరమైన నిధులను అప్పుల ద్వారా సమకూర్చితే వాటిపై చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కూడా ఈ లెక్కల్లో పరిగణనలోకి తీసుకోలేదు. ఆ వ్యయాన్ని కలిపితే మొత్తం యుద్ధ ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ట్రంప్ సర్కారు వాదన ఇదీ..
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను వైట్‌హౌస్ సమర్థించింది. అమెరికా సిబ్బంది, దేశ ప్రయోజనాలకు ఇరాన్ నుంచి ముప్పు లేకుండా చేయడానికే ఈ చర్యలు చేపట్టినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు. అమెరికా సైన్యం వద్ద తగినంత ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిల్వలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అధ్యక్షుడి వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడానికి అవసరమైన సామర్థ్యం అమెరికా వద్ద ఉందని తెలిపారు.
పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ కూడా CBO నివేదికలో పేర్కొన్న ఆయుధ కొరత అంచనాలను వ్యతిరేకించారు. అధ్యక్షుడు ఎప్పుడు, ఎక్కడ దాడి చేయాలని నిర్ణయించినా.. అందుకు అవసరమైన సైనిక సామర్థ్యం తమ వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లోనూ ఎదురు దాడి
అమెరికా యుద్ధ వ్యయంపై ఈ సమీక్షను ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీలోని డెమొక్రాట్ల తరఫున బ్రెండన్ బాయిల్ కోరారు. యుద్ధం ఇప్పటికే అమెరికా సైనికుల ప్రాణాలను బలిగొందని, మరికొందరిని గాయపరిచిందని ఆయన పేర్కొన్నారు.అమెరికా పన్ను చెల్లింపుదారులపై దశల కోట్ల డాలర్ల భారం పడుతోందని, అదే సమయంలో దేశంలో జీవన వ్యయాలు కూడా పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
హార్ముజ్‌పై చర్చలకు ఒత్తిడి
ఇరాన్ యుద్ధానికి పెరుగుతున్న వ్యయం, ఆయుధ నిల్వలపై పడుతున్న ఒత్తిడి, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. మరోవైపు ప్రపంచంలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి పరిస్థితి కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే అమెరికా ఖజానాపైనే కాకుండా.. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, సైనిక సన్నద్ధతపై కూడా దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 38 బిలియన్ డాలర్లతో మొదలైన ఈ లెక్క.. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ మరింత పెరగనుంది. అదే సమయంలో తగ్గుతున్న ఆయుధ నిల్వలను పూడ్చేందుకు ఏళ్ల సమయం అవసరం కావడం అమెరికా ముందు మరో కీలక సవాలుగా మారింది.
