Iran-Protests-Us-Military-Action : ఇరాన్ భ‌గ్గు..! Andhra Prabha Top Story

Iran-Protests-Us-Military-Action : ఇరాన్ భ‌గ్గు..! Andhra Prabha Top Story

  • ఆగ‌ని నిర‌స‌న జ్వాల
  • అమెరికా జోక్యంపై ఆందోళన!
  • మూడో వారంలోకి ఆందోళనలు
  • దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ బ్లాక్‌
  • అమెరికా జోక్యం సాకుతో హింస ఇరాన్‌ విదేశాంగ మంత్రి
  • సైనిక చర్యకు ట్రంప్‌. సిద్ధం

( టెహ్రాన్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఇరాన్‌లో ప్రజా ఆందోళనలు మూడో వారంలోకి ప్రవేశించాయి. తొలుత పెరిగిన జీవన వ్యయాలు, ఆర్థిక ఇబ్బందులపై మొదలైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి. పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా సైనిక జోక్యంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడం, భద్రతా బలగాల చర్యలు, ప్రభుత్వ-నిరసనకారుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

అమెరికా జోక్యం సాకుతో హింస’’

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ సోమవారం టెహ్రాన్‌లో విదేశీ దౌత్యవేత్తలతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా, రక్తపాతంగా మారేలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైనిక చర్యకు హెచ్చరికలు చేయడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.వారాంతంలో హింస తీవ్రత పెరిగినప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని అరాఘ్చీ తెలిపారు.
యుద్ధానికి సిద్ధం అదే సమయంలో చర్చలకు కూడా సిద్ధమే’’ అని ఆయన స్పష్టం చేశారు. నిరసనకారులకు ఆయుధాలు పంపిణీ చేస్తున్న దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని అరాఘ్చీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న కొందరి నుంచి వాంగ్మూలాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. విదేశీ శక్తులు నిరసనలను రెచ్చగొట్టి, తీవ్రతరం చేశాయని ఆరోపించిన ఆయన.. ఇందుకు బాధ్యులను భద్రతా బలగాలు వేటాడతాయని పేర్కొన్నారు.

ఆరుగురు ఉగ్రవాదులు హ‌తం

రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని మంజిలాబాద్‌ పట్టణం నుంచి బాంబు దాడికి కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ‘ఉగ్రవాద సంస్థ’కు చెందిన ఆరుగురిని ఇరాన్‌ భద్రతా బలగాలు హతమార్చినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుత నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత ముమ్మరమైనట్లు ఈ ఘటన సూచిస్తోంది.

భద్రతా సిబ్బంది మరణాలపై భిన్న గణాంకాలు

నిరసనల్లో భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. సెమీ-అధికారిక తస్నీమ్‌ వార్తా సంస్థ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 109 మంది భద్రతా సిబ్బంది మరణించారు. నిరసనకారుల్లో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. దేశం వెలుపల ఉన్న ప్రతిపక్ష కార్యకర్తలు మాత్రం మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ గణాంకాలను స్వతంత్రంగా ధ్రువీకరించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వం మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. నిరసనల్లో మరణించిన భద్రతా సిబ్బందిని కూడా ‘అమరులు’గా పేర్కొంది.

రాజధానిలో పరిమిత ఆందోళనలు

ఫార్స్‌ వార్తా సంస్థ ప్రకారం.. ఆదివారం రాత్రి టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో నిరసనలు జరిగాయి. నవాబ్‌, సాదత్‌ అబాద్‌ ప్రాంతాలతోపాటు చహార్‌మహల్‌-బఖ్తియారీ ప్రావిన్స్‌లోని జుంకాన్‌, హఫ్షేజాన్‌, మష్హద్‌లోని తైబాద్‌లో ‘అల్లర్లు’ జరిగాయని, భద్రతా బలగాలు వాటిని చెదరగొట్టాయని తెలిపింది.దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రాత్రి పరిస్థితి సాధారణంగానే ఉందని ఫార్స్‌ పేర్కొంది.మరోవైపు ప్రభుత్వ అనుకూల ర్యాలీల దృశ్యాలను ఇరాన్‌ మీడియా సోమవారం విడుదల చేసింది. టెహ్రాన్‌లో జరిగిన భారీ ర్యాలీలో అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ పాల్గొని, జాతీయ జెండాలు పట్టుకున్న ప్రజలను పలకరిస్తూ వారితో కలిసి నడిచిన దృశ్యాలను తస్నీమ్‌ ప్రసారం చేసింది.

‘‘నాలుగు రంగాల్లో యుద్ధం’’

ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బఘేర్‌ ఘలీబాఫ్‌ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ.. దేశం ‘‘నాలుగు రంగాల్లో యుద్ధం’’ చేస్తోందని అన్నారు.ఆర్థిక యుద్ధం, మానసిక యుద్ధం, అమెరికా-ఇజ్రాయెల్‌తో సైనిక యుద్ధంతోపాటు ప్రస్తుతం ఉగ్రవాదులతో కూడా పోరాడుతున్నామని పేర్కొన్నారు.

నాలుగో రోజులుగా ఇంటర్నెట్‌ బ్లాక్‌ఔట్‌

ఇరాన్‌లో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత నాలుగో రోజుకు చేరింది. కనెక్టివిటీని పర్యవేక్షించే సంస్థ నెట్‌బ్లాక్స్‌.. దేశంలో స్థిరమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ నిలిచిపోయి 84 గంటలు దాటిందని తెలిపింది.కొంతమంది ఇరానియన్లు ఆంక్షలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ కారణంగా సామాజిక మాధ్యమాల్లో నిరసనలకు సంబంధించిన వీడియోల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇంటర్నెట్‌ నిలిపివేతను మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. నిరసనకారులపై జరుగుతున్న అణచివేతకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రాకుండా చేసేందుకే ఈ చర్య చేపట్టారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపించింది. త్వరలో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తామని అరాఘ్చీ తెలిపారు. దౌత్య కార్యాలయాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు కూడా కనెక్టివిటీ పునరుద్ధరిస్తామని చెప్పారు.

అవకాశాలను పరిశీలిస్తున్నాం’’

ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యతో సహా ‘‘చాలా బలమైన అవకాశాలను’’ అమెరికా పరిశీలిస్తోందని తెలిపారు.‘‘మేము దీనిని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నాం. సైన్యం కూడా పరిశీలిస్తోంది. చాలా బలమైన అవకాశాలను చూస్తున్నాం. తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో ట్రంప్‌ అన్నారు. సైనిక చర్యపై ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ నాయకత్వం చర్చలకు సిద్ధమైందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో ఓ సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.దాడి చేస్తే అమెరికా స్థావరాలే లక్ష్యమంటూ హెచ్చరిక అమెరికా ‘‘తప్పుడు అంచనా’’ వేయొద్దని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘలీబాఫ్‌ హెచ్చరించారు. ఇరాన్‌పై దాడి జరిగితే ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా సైనిక స్థావరాలు, నౌకలు తమకు చట్టబద్ధమైన లక్ష్యాలవుతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌లో కమాండర్‌గా పనిచేసిన ఘలీబాఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది 12 రోజుల యుద్ధం

గతేడాది ఇరాన్‌ 12 రోజులపాటు ఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధాన్ని ఎదుర్కొంది. జూన్‌లో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు చేయగా.. అమెరికా ఆ దేశంలోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసింది. ఆ యుద్ధంలో వందలాది మంది పౌరులు, సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తలు మరణించారు. ప్రతిగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై వందలాది బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించగా.. 28 మంది మరణించినట్లు అప్పట్లో సమాచారం వెలువడింది.

ఆర్థిక వ్యవస్థపై చర్యలు తీసుకుంటాం పెజెష్కియాన్‌

ప్రస్తుత నిరసనలు ప్రారంభమైన తర్వాత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హామీ ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశంలో ‘‘గందరగోళం, అశాంతి సృష్టించేందుకు’’ ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిరసనకారుల్లోని ‘అల్లరిమూకలు, ఉగ్రవాదుల’ నుంచి ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌లోని తాజా నిరసనలు.. 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారాయి. గతేడాది జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు.. ఆర్థిక సమస్యలపై మొదలైన ఆందోళనలు ఇప్పుడు భద్రత, విదేశీ జోక్యం అంశాలతో మరింత సంక్లిష్టంగా మారాయి.