Phone 18 Pro price | ఆ దేశంలో ఐఫోన్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కొత్త ఐఫోన్ మోడళ్ల విడుదల హడావుడి నెలకొంది. అయితే వినియోగదారులను ఆకట్టుకునే బెస్ట్ ఆఫర్లు తక్కువ ధరలు మాత్రం కేవలం అమెరికా (USA)కే పరిమితమవుతున్నాయి. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో $1,199 అంటే సుమారు రూ.1.15 లక్షలు కాగా 18 ప్రో మ్యాక్స్ $2,499 అంటే సుమారు రూ.2.40 లక్షలు ఉంది ( టాక్స్‌తో కలిపి). ఇతర దేశాల్లో మాత్రం ఐఫోన్ కొనుగోలు వినియోగదారుల జేబులకు చిల్లు పడేలా చేస్తోంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) అందించిన డేటా ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలు అమెರಿకాతో పోలిస్తే ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన మార్కెట్లలో అత్యధికంగా ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ ఎక్కడ?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ ఎక్కడ లభిస్తుందనే విషయంలో స్థానిక పన్నులు, దిగుమతి సుంకాల ప్రభావం చాలా తీవ్రంగా పనిచేస్తోంది. దీనివల్ల దేశాన్ని బట్టి ఐఫోన్ ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, టర్కీలో పన్నుల భారం విపరీతంగా ఉండటంతో అక్కడ ఐఫోన్ ధర అమెరికాతో పోలిస్తే దాదాపు రెట్టింపుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఐఫోన్ ధర అత్యధికంగా ఉన్న దేశం ఇదే. ఇక్కడ ఐఫోన్ 18 ప్రో $2,898 (సుమారు రూ.2.78 లక్షలు). 18 ప్రో మ్యాక్స్ $5,376 అంటే సుమారు రూ.5.16 లక్షలు. ఇది అమెరికా ధర కంటే 102% ఎక్కువ.

ఇక ఆపిల్‌కు నాల్గవ అతిపెద్ద మార్కెట్, రెండవ అతిపెద్ద తయారీ కేంద్రమైన భారతదేశంలో కూడా పన్నుల కారణంగా ధరలు అమెరికా కంటే 30 శాతం నుండి 40 శాతం వరకు ఎక్కువగా ఉంటున్నాయి. ఇండియాలో ఐఫోన్ 18 ప్రో $1,649 అంటే సుమారు రూ.1.58 లక్షలు. 18 ప్రో మ్యాక్స్ $3,299 అంటే సుమారు రూ.3.16 లక్షలు.

మరోవైపు యూఏఈలో కేవలం 5 శాతం వ్యాట్ మాత్రమే ఉండటం, ఇతర పన్నులు లేకపోవడంతో అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఐఫోన్లు లభించే రెండవ మార్కెట్‌గా అది నిలిచింది. చైనా, కొరియా వంటి దేశాల్లో పన్నుల ప్రభావంతో పాటు స్థానిక బ్రాండ్ల పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. చైనాలో హువావే, ఒప్పో, వివోల నుంచి, కొరియాలో శాంసంగ్ నుంచి ఎదురయ్యే తీవ్ర పోటీ వల్ల ఆపిల్ అక్కడ ధరలను కొంతవరకు నియంత్రణలో ఉంచక తప్పడం లేదు.

‘మేడ్ ఇన్ ఇండియా’ ఉన్నా ధరలు ఎందుకు తగ్గడం లేదు?

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఆపిల్ తన తయారీని విస్తరిస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 25% వరకు ఉంది.అయినా కూడా మనదేశంలో ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు:

  1. దిగుమతి సుంకాలు & GST: కొత్తగా వచ్చే మోడళ్లు (ముఖ్యంగా ఫోల్డబుల్ డ్యూయో) ప్రారంభంలో భారతదేశంలో తయారవ్వవు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే యూనిట్లపై పూర్తి స్థాయి ఇంపోర్ట్ డ్యూటీలతో పాటు జీఎస్టీ (GST) పడటంతో ధరలు భారం అవుతాయి.
  2. విడిభాగాల దిగుమతి: భారతదేశంలో అసెంబుల్ అవుతున్న ఐఫోన్‌లలో స్థానిక విడిభాగాల వాటా కేవలం 18% నుండి 20% మాత్రమే. మిగిలిన విడిభాగాలన్నింటినీ భారీ పన్నులు చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
  3. ప్రో మోడల్స్ ప్రాధాన్యత: బేస్ మోడళ్లతో పోలిస్తే ‘ప్రో’ (Pro) సిరీస్ మోడళ్లు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.
  4. రూపాయి బలహీనత: విదేశీ మారకద్రవ్యంతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం.

పాత మోడళ్ల ధరలూ పైపైకే!

గ్లోబల్ మార్కెట్‌లో ఏర్పడిన చిప్‌ల కొరత వల్ల ఐఫోన్ మోడళ్ల ధరలు పెరుగుతాయని ఆపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ ముందే హెచ్చరించారు. రీసెంట్ లాంచ్ ఈవెంట్ తర్వాత పాత ఐఫోన్ మోడళ్ల ధరలు అమెరికాలో 21% వరకు పెరగ్గా, భారతదేశంలో ఏకంగా 41% వరకు పెరగడం గమనార్హం.