రంగంలోకి.. రెవిన్యూ అధికారులు..
ముత్తుకూరు, ఆంధ్ర ప్రభ : మొంధా తుఫాను నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టు(Krishnapatnam Port)లో సంబంధిత శాఖ అధికారులు తుఫాన్ హెచ్చరిక ప్రమాదాన్ని తెలియజేస్తూ ఎనిమిదవ నెంబర్ జెండాను మంగళవారం ఎగరవేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఉదయం నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది.
స్వల్పమైన ఈదురు గాలులు, చలిగాలులు వీచాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుఫాను పరిస్థితి ఎదుర్కొనేందుకు మండల ప్రభుత్వ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల వల్ల జనజీవనం(Janjeevanam) స్తంభించిపోయింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు జీవనోపాధి కోల్పోయారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి లేక మూడు రోజుల నుంచి నివాస గృహాలకు పరిమితమయ్యారు.
ప్రమాదకరమైన తుఫాను నేపథ్యంలో కృష్ణపట్నం సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరం ప్రాంతం వెంబడి ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల కుటుంబాలను రెవిన్యూ శాఖ(Revenue Department) అధికారులు పునరావాసం కేంద్రాలకు తరలించి అక్కడ ప్రభుత్వపరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఎవరు కూడా సముద్రంలో లేకుండా సిబ్బందిని ఏర్పాటు చేసి విధులు అప్పగించారు. పోలీస్ శాఖ కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, కృష్ణపట్నం, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు జెపి శ్రీనివాసరెడ్డి(JP Srinivasa Reddy), ప్రసాద్ రెడ్డి, ఇతర సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేశారు.
నేలటూరు దళితవాడ గ్రామంలో వర్షపు నీటితో వీధులు నిండిపోవడంతో డ్రైనేజీ బయటకు వెళ్లే విధంగా తాసిల్దార్ స్వప్న యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. అదే విధంగా నక్కల కాలువ వంతెన వద్ద గుర్రపు డెక్క ఆకు పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా ఏర్పడడంతో జెసిబి ద్వారా తొలగించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తుఫాను విధుల్లో భాగస్వామ్యం అయ్యారు.
రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్(Panchayati Raj) శాఖ విభాగం ఉన్నతాధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించుకుంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహార సదుపాయానికి ఇబ్బందులు పడుతూ పునరావాసం కేంద్రాలకు రానటువంటి పేదలకు ప్రభుత్వం భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులకు పలువురు దాతలు భోజనం సౌకర్యాన్ని కల్పించారు.

