వైభవంగా ‘ఇంటర్నేషనల్ ఇంక్ బౌండ్ 2.0’ వేడుక
ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కస్తూరి విజయం పబ్లిషర్స్ సంస్థ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఇంక్ బౌండ్ 2.0’ వేడుక శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కస్తూరి విజయం సంస్థ వ్యవస్థాపకులు పామర్తి సుధీర్ పామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, రచయిత, నటుడు తనికెళ్ల భరణి, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రవీణ్ యజ్ఞాల రచించిన, కస్తూరి విజయం పబ్లిషర్స్ ప్రచురించిన ‘స్క్రీన్‌ప్లే మాస్టర్ సుకుమార్’ పుస్తకాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత వంగూరి చిట్టెన్ రాజు రచించిన ‘అవేమైనా జ్ఞాపకాలా మర్చిపోవడానికి’ పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. 48 కథల సంకలనం ‘అమ్మమ్మ కథల ఖజానా’ పుస్తకాన్ని రచయితల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుస్తకం మధుర జ్ఞాపకాల భాండాగారమని అన్నారు. ‘అవేమైనా జ్ఞాపకాలా మర్చిపోవడానికి’ పుస్తకంలో వంగూరి చిట్టెన్ రాజు ఎన్నో విషయాలను ఆవిష్కరించారని, మరచిపోతున్న సంప్రదాయాలు, కట్టుబొట్టు, భాషలను గుర్తు చేశారని పేర్కొన్నారు. భారత్‌లో కంటే విదేశాల్లోనే భారతీయ సంప్రదాయాలను చక్కగా పాటిస్తున్నారని, దేశంలో పాశ్చాత్య సంస్కృతి పేరుతో వింత పోకడలను అనుసరిస్తున్నారని అన్నారు. ‘స్క్రీన్‌ప్లే మాస్టర్ సుకుమార్’ పుస్తకం రావడం అభినందనీయమని, సినిమాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. హాస్యం, భాష ఉంటే సినిమాకు గ్లామర్ వస్తుందని, ఈ దిశగా సినీ ప్రముఖులు చొరవ తీసుకోవాలని అన్నారు. దర్శకుడు సుకుమార్‌పై మూడు భాషల్లో పుస్తకం రావడం అభినందనీయమన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ సుధీర్ పామిరెడ్డి కుటుంబ సభ్యులు సాహిత్య ప్రియులని, కుటుంబం మొత్తం పుస్తకాల ప్రచురణలో ఉండటం అభినందనీయమన్నారు. ప్రవీణ్ యజ్ఞాల తన ‘మిథునం’ సినిమా కథ, స్క్రీన్‌ప్లేపై తులనాత్మక పరిశోధనతో పుస్తకం తీసుకొచ్చారని, సుకుమార్‌పై రాసిన పుస్తకాన్ని కూడా చదివి తన అభిప్రాయం తెలియజేస్తానని తెలిపారు.
