ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రశంసలు
డ్రోన్ సాంకేతికతతో కషాయాల పిచికారీపై ఇండోనేషియా, థాయిలాండ్ ప్రతినిధుల ఆసక్తి
గుంటూరు, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను అధ్యయనం చేసేందుకు ఇండోనేషియా, థాయిలాండ్‌కు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించింది. రైతులు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, దేశీయ విత్తనాల పరిరక్షణ, కషాయాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్న తీరును ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పర్యటనలో భాగంగా తొలుత తెనాలి మండలంలోని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పరిధిలో కొత్తగా ఎంపికైన హాఫ్‌పేట గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న వరి పొలాలతో పాటు రసాయన వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి క్షేత్రాలను పరిశీలించి తేడాలను తెలుసుకున్నారు. మొదటి ఏడాదే ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతు యడవల్లి పూర్ణయ్య పొలంలో పంట వేర్లు బలంగా ఉండటం, ఎక్కువ పిలకలు రావడాన్ని ప్రతినిధులు గమనించారు. ఖరీఫ్ సాగుకు ముందు చేపట్టిన పీఎండీఎస్ ప్రక్రియ కూడా మంచి ఫలితాలు ఇస్తున్నట్లు పరిశీలనలో గుర్తించారు.
రైతుల అనుభవాలు తెలుసుకున్న ప్రతినిధులు
అనంతరం హాఫ్‌పేట రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఎలా మారుతున్నారు, ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అందుతున్న సహకారం తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి రైతుల పరివర్తనలో క్షేత్రస్థాయి మార్గదర్శకత్వం, ప్రకృతి వ్యవసాయ విస్తరణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రైతులు తమ అనుభవాలను ప్రతినిధులతో పంచుకున్నారు.
ప్రకృతి వ్యవసాయ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతినిధులు అభినందించారు. రైతులను రసాయన ఆధారిత సాగు నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
150 దేశీయ వరి వంగడాల పరిశీలన
తదుపరి అత్తోటలోని భూమి భారతి కేంద్రాన్ని ప్రతినిధులు సందర్శించారు. అక్కడ సుమారు 150 రకాల దేశీయ వరి వంగడాలను పరిశీలించారు. దేశీయ విత్తనాల సేకరణ, వాటి పరిరక్షణ, క్షేత్రస్థాయిలో వాటి సాగు విధానాలను తెలుసుకున్నారు.
అక్కడ ఐదు ఎకరాల వరి క్షేత్రంలో దశపర్ణి కషాయాన్ని డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తున్న తీరుపై ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. పెద్ద విస్తీర్ణంలో కషాయాలను వేగంగా పిచికారీ చేయడానికి డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్న విధానాన్ని అభినందించారు.
కుటుంబ ఆరోగ్యంపై దృష్టి
అనంతరం అన్నవరం గ్రామంలోని వంటింటి తోటను సందర్శించారు. కుటుంబ ఆరోగ్యం, రసాయన రహిత ఆహారం, పోషకాహారం వంటి అంశాలపై అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. వి.ఓ. నవచైతన్య సభ్యులతో పరస్పర చర్చ జరిపి వంటింటి తోటల ద్వారా కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతున్న తీరును తెలుసుకున్నారు. మహిళల భాగస్వామ్యం, కుటుంబ స్థాయిలో పోషకాహార భద్రతకు వంటింటి తోటలు దోహదపడుతున్న తీరును ప్రశంసించారు.
ఈ పర్యటనలో రైతు సాధికార సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల విభాగానికి చెందిన పావని, జయశ్రీ, అదనపు డీపీఎం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాల అమలు, రైతుల అనుభవాలు, సాంకేతికత వినియోగం తదితర అంశాలను పరిశీలించిన అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటనతో జిల్లాలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది.
