అంతర్‌జిల్లాల దొంగ అరెస్ట్
రూ.84 లక్షల విలువైన 47 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : ఇళ్లకు తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లాల దొంగను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.84 లక్షల విలువైన 47 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి వైఎస్సార్ కాలనీకి చెందిన ఒంటిపులి శ్రీనివాసులు పలు జిల్లాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 2016 నుంచి నిందితుడు ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు.
ముఖ్యంగా ఇళ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన నివాసాలనే అతడు లక్ష్యంగా చేసుకునేవాడని ఎస్పీ తెలిపారు. పగటి సమయంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లి దొంగతనాలకు పాల్పడేవాడని వివరించారు.
దొంగతనాలకు పాల్పడే ముందు ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించడం నిందితుడి అలవాటుగా ఉండేదని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత రాత్రి సమయంలో లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలను అపహరించేవాడని పేర్కొన్నారు.
సుమారు 20 కేసుల్లో నిందితుడు ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పాకాల, పలమనేరు తదితర ప్రాంతాల్లో కూడా అతడు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. గతంలో బుక్కపట్నం, ధర్మవరం, పీలేరు ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ తన కార్యకలాపాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.
వరుస దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిందితుడి కదలికలు, గత నేర చరిత్ర ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అతడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు దొంగతనాల కేసులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి 47 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.84 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి అరెస్టుతో పలు దొంగతనాల కేసులు కొలిక్కి వచ్చినట్లు వెల్లడించారు.
ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజుల పాటు బయటకు వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. విలువైన వస్తువుల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
