గత పాలనలో ఘోరంగా తయారైన ఆయుష్ వైద్య సేవలను మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆయుర్వేద, హోమియో, యూనాని, ప్రకృతి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా ఆసుపత్రులను కొత్తగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో విశాఖలో తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభం కాబోతున్నాయి. విశాఖ, కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. అలాగే, విశాఖ నగరంలోనే ప్రభుత్వ ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగ శాల కూడా రాబోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2016–17లోనే నేచర్ క్యూర్ ఆసుపత్రి (ప్రకృతి వైద్య కళాశాల)తో పాటు రెండు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటు కోసం ఆమోదం తెలిపింది. అయితే అప్పటి ప్రభుత్వ కృషిని తరువాత అధికారంలోకి వచ్చిన గ‌త వైసీపీ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయి.

ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఈ ప్రాజెక్టులకు ఊపిరి లభించింది. కాకినాడలోని ఆసుపత్రికి రూ.7.17 కోట్లు, విశాఖలోని ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి రూ.4.18 కోట్లు, నేచర్ క్యూర్ వైద్య కళాశాలకు రూ.4.08 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయి.

మూడు సంవత్సరాల విరామం తరువాత నిధుల విడుదల కావడంతో రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు

నేచర్ క్యూర్ వైద్య కళా శాలలో 2026-27 నుంచి ప్రవేశాలు

విశాఖలోని విమ్స్ ప్రాంగణంలో రూ.16.40 కోట్లతో చేపట్టిన నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి బ్యాచులర్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగా సైన్సెస్ (బీఎన్వైఎస్) కోర్సులో తరగతులు ప్రారంభంకానున్నాయి. బీఎన్ వైఎస్ కోర్సులో 50 సీట్ల భర్తీకి కేంద్రం ఆమోదం తెలుపనుంది.

ఈ కళాశాల పక్కనే.. రూ.14.85 కోట్ల వ్యయంతో 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణపనులు కూడా పూర్తయ్యేద శలో ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో ఆయుర్వేద, హోమియో, యూనాని వైద్య సేవలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి.

వీటి ఆధారంగా కేంద్రం అడ్మిషన్స్ కు అనుమతి ఇస్తుoది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినందున అడ్మిషన్స్ త్వరగా స్టార్ట్ చేయడానికి వెసులుబాటు ఉంది.

నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు

నేచర్ క్యూర్ వైద్య కళాశాల ఏర్పాటుకు తగ్గట్లు ప్రత్యేకంగా నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 50 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. సుమారు రూ.16 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి.

విశాఖలోనే ఆయుర్వేద మందుల తయారీ, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్
విశాఖలోని శొంఠ్యాం ప్రాంతంలో సుమారు రూ.6 కోట్లతో ఆయుర్వేద ఫా€్మసీ, డ్రగ్ టెస్టింగ్ లేబరోరేటరీల భవన నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారు రూ.5 కోట్లతో పరికరాలు, యంత్రాలు, ఇతర వాటి కొనుగోళ్ల ప్రక్రియ జరగనుంది.

కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి

కాకినాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 50 పడకలతో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఆయుర్వేద, హోమియో, యూనాని వైద్య సేవలు ఇక్కడ ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన వైద్య పరికరాలు, యంత్రాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. మూడు నెలల్లోగా ఈ ఆసుపత్రి సేవలు ప్రజలకు అందుబాటులోనికి రానున్నాయి.

ధర్మవరం, కాకినాడలో ఆయుర్వేద వైద్య కళా శాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు!

నేషనల్ ఆయుష్ మిషన్ కింద కాకినాడలో ఆయుర్వేద వైద్య కళాశాల, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కళాశాలల ఏర్పాటుఆమోదం కోసం కేంద్ర ఆయుష్ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ వెల్లడించారు. ధర్మవరంలో ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉండాల్సిన ఆయుర్వేద ఆసుపత్రిని 50 పడకలతో ఏర్పాటుచేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

Leave a Reply