మొబైల్ విడిభాగాల పేరుతో రూ.5.30 కోట్ల కుచ్చుటోపి!
ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రయాల పేరిట సైబర్ మోసం.. అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్టు
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : మొబైల్ ఫోన్ల విడిభాగాలు, ఉపకరణాల విక్రయాల పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఛేదించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు కుచ్చుటోపి వేసిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో సైబర్ మోసం వివరాలను వెల్లడించారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ కుమార్ మొబైల్ దుకాణం నిర్వహిస్తూ ఆన్‌లైన్ వ్యాపారం పేరిట సామాజిక మాధ్యమాల్లో మొబైల్ విడిభాగాలు, ఉపకరణాలను విక్రయిస్తామని నమ్మించేవాడని ఎస్పీ తెలిపారు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలను ఏర్పాటు చేసి, తక్కువ ధరకే విడిభాగాలు అందిస్తామని ప్రచారం చేసేవాడని చెప్పారు. వినియోగదారులను నమ్మించి క్యూఆర్ కోడ్ ద్వారా భారీ మొత్తంలో నగదు సేకరించినట్లు వెల్లడించారు.
ఇచ్చోడ కేసుతో కూపీ లాగిన పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా వడూర్ గ్రామానికి చెందిన సమీర్ సయ్యద్ ఇచ్చోడలోని బర్కత్‌పురా కాలనీలో ఏ టు జెడ్ పేరుతో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రకటనలను నమ్మి గత జూలై 25న మొబైల్ విడిభాగాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించాడు. మొబైల్ చార్జర్లు, ఇతర విడిభాగాలు తక్కువ ధరకే లభిస్తాయని నమ్మి ‘రాజ్ లెడ్ ముంబై’ పేరుతో ఉన్న ఖాతా ద్వారా ఫోన్ చేసి విడిభాగాలను ఆర్డర్ చేశాడు.
ముందుగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తేనే విడిభాగాలు పంపిస్తామని సదరు వ్యక్తి నమ్మించడంతో రెండు వారాల్లోనే క్యూఆర్ కోడ్‌కు ఫోన్‌పే ద్వారా రూ.2.18 లక్షలు చెల్లించాడు. అయితే నగదు చెల్లించినా ఇప్పటివరకు కొరియర్ ద్వారా విడిభాగాలు రాకపోవడంతో సమీర్ ఇచ్చోడ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు.
ఈ కేసును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేయించారు. దర్యాప్తులో సైబర్ మోసం మూలాలను పోలీసులు గుర్తించారు. ప్రకాశ్ కుమార్‌ను అరెస్టు చేసి విచారించగా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసి రూ.5 కోట్ల 30 లక్షల 33 వేల నగదును స్వాహా చేసినట్లు తేలిందని ఎస్పీ వివరించారు. నిందితుడి నుంచి రూ.లక్ష నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి
ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కనిపించే తక్కువ ధరల విక్రయ ప్రకటనలను నమ్మే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఏదైనా సందేహం వచ్చినా, మోసానికి గురైనా వెంటనే సైబర్ నేరాల సహాయవాణి 1930కు సమాచారం అందించాలని సూచించారు.
ఈ మీడియా సమావేశంలో ఉట్నూర్ ఎస్పీ రుత్విక్ సాయి కొట్టే (ఐపీఎస్), ఇచ్చోడ ఇన్‌స్పెక్టర్ కె. నరేష్ కుమార్, సైబర్ నేరాల ఎస్‌ఐ గోపీకృష్ణ, సైబర్ సిబ్బంది మస్జిద్, త్రిశూల్, అజాజ్ పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర సైబర్ మోసాన్ని ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
