అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా విముక్తి కోసం పోరాడాలి

ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలు చేపట్టాలి
సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకుడు యాకయ్య
దంతాలపల్లి, ఆంధ్రప్రభ:
అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో దేశ విముక్తి కోసం పోరాటాలు కొనసాగించాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ తొర్రూరు డివిజన్‌ నాయకుడు సెగం యాకయ్య పిలుపునిచ్చారు. నవంబర్‌ 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యమిస్తున్నారని, వారి పోరాటాలకు అండగా నిలవాలని అన్నారు.

ఓట్ల తొలగింపు ప్రక్రియతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. భారత విప్లవోద్యమంలో వందలాది, వేలాది మంది అమరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి ఏరుకొండ శ్రీను జెండా ఆవిష్కరించారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ ప్రవీణ్‌, నాయకులు ఏరుకొండ ఉప్పలయ్య, కొమురయ్య, వెంకన్న, రాజన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.