కాలుష్యంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని దండు మల్కాపురం, ఎల్లగిరి, అంతమ్మగూడెం, దోతిగూడెం తదితర గ్రామాల్లో పరిశ్రమల రసాయన వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం వివిధ శాఖలకు చెందిన అధికారుల బృందం ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. దండు మల్కాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో పరిశ్రమల సమీపంలో ఉన్న పంట పొలాలను అధికారులు నిశితంగా పరిశీలించి వివరాలను సేకరించారు.

కలుషిత నీటి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయామని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎకరాకు రూ.60 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ తనిఖీల్లో భువనగిరి ఇన్‌చార్జి ఏడీఏ ఎజాజ్‌ అలీ ఖాన్‌, చౌటుప్పల్‌, భూదాన్‌ పోచంపల్లి మండలాల తహసీల్దార్లు బి. వీరాబాయి, పరిగి శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఆర్‌ఐలు బాణాల రాంరెడ్డి, కొప్పుల సుధాకర్‌రావు, దండు మల్కాపురం, జూబ్లక్‌పల్లి గ్రామాల ఏఈవోలు కావ్య, నరేష్‌తో పాటు సర్వేయర్లు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలు, సేకరించిన వివరాలతో సమగ్ర నివేదికను ఆర్‌డీఓ ద్వారా జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.