Bollaram Army Weapons Theft Case | ఆయుధాల చోరీలో ఇంటిదొంగ అరెస్టు !
- మాజీ హవల్దారే ..సూత్రధారి.. పాత్రధారి
- జూన్ 30న ఉద్యోగం ఊడితే… ఆగస్టు 30న చోరీ
- పది రోజుల మిస్టరీకి తెర..
- అసలు మాస్టర్‌మైండ్ మాజీ హవల్దార్!
- 4 ఏకే-203 రైఫిళ్లు, ఇన్‌సాస్, పిస్టళ్లు, బుల్లెట్లు రికవరీ
- పాక్ ఆయుధ డీలర్ సోషల్ మీడియా లింక్‌పై ఆరా..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం (Bollaram Army Weapons Theft Case) నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల చోరీకి సంబంధించి బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్రాస్ రెజిమెంట్ యొక్క 20వ బెటాలియన్‌కు చెందిన ఒక లెఫ్టినెంట్ కల్నల్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అత్యంత భద్రత ఉండే ఆర్మీ ప్రాంతంలోకి బయట వ్యక్తి వెళ్లి ఆయుధాలు ఎత్తుకెళ్లడం అంత ఈజీ కాదని మొదటి నుంచే అనుమానించిన పోలీసులు.. చివరకు ఇన్‌సైడర్ కోణంలోనే కేసును ఛేదించారు. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజు ఈ చోరీకి ప్రధాన నిందితుడిగా తేలాడు. అతడిని పోలీసులు శుక్రవారం అధికారికంగా అరెస్ట్ చేశారు.
కేసు దర్యాప్తులో పోలీసులు ఒక్కో లింక్‌ను కలుపుకుంటూ వెళ్లారు. సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ సిగ్నల్స్, ఫోన్ కాల్స్, వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్ ఆధారాలతోపాటు అనుమానితుల గత చరిత్రను కూడా తిరగేశారు. చివరకు మల్లేష్ కదలికలపై ఫోకస్ పెట్టడంతో అసలు కథ బయటపడింది.
అయితే ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి చెందిన ఓ ఆయుధాల విక్రేత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అతడు ఫాలో అవుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో చోరీ చేసిన ఆయుధాలను అమ్మేందుకే ఈ పని చేశాడా? ఇంకా ఎవరికైనా అప్పగించాలనుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
పది రోజుల తర్వాత మిస్టరీకి తెర
ఆగస్టు 31న వెలుగులోకి వచ్చిన ఆయుధాల చోరీ కేసులో పది రోజులపాటు సాగిన దర్యాప్తు అనంతరం సెప్టెంబర్ 11న ప్రధాన నిందితుడిగా మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానితుల విచారణ, ఆర్మీ సిబ్బంది వివరాల పరిశీలన, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ సిగ్నల్స్, మల్లేష్ గత చరిత్ర, కుటుంబ సభ్యుల విచారణ తదితర అంశాలను సమన్వయం చేసుకుంటూ పోలీసులు కేసును ఛేదించారు. చివరకు మల్లేష్ ఇచ్చిన సమాచారంతో చోరీకి గురైన ఆయుధాలను కూడా రికవరీ చేశారు.
ఆగస్టు 31న బయటపడిన చోరీ
ఆగస్టు 30న చివరిసారిగా ఆయుధాలు సురక్షితంగానే ఉన్నట్లు రికార్డుల్లో నమోదు కాగా, మరుసటి రోజు ఆగస్టు 31న అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయుధాగారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని ఆర్మీ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బ్రిగేడియర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యంత భద్రత ఉండే ఆర్మీ ప్రాంతంలోకి బయటి వ్యక్తి ప్రవేశించి ఇంత భారీగా ఆయుధాలు ఎత్తుకెళ్లడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్న పోలీసుల ముందుకు వచ్చింది. దీంతో బయట వ్యక్తుల ప్రమేయంతోపాటు ఆయుధాగారంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న అంతర్గత వ్యక్తుల కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
భారీ వర్షం, చీకటిని అనుకూలంగా మార్చుకున్న నిందితుడు ఆయుధాగారంలోకి ప్రవేశించి ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఉండే నిఘా వర్షం కారణంగా కొంత మేరకు తగ్గిన సమయాన్ని అతడు ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
అనుమానితుల జాబితా.. ఒక్కొక్కరిని విచారణ
ఆయుధాగారంలోకి ఎవరెవరికి ప్రవేశం ఉందనే వివరాలను సేకరించిన పోలీసులు ప్రత్యేక జాబితాను రూపొందించారు. ఆయుధాగారం పరిసరాల్లో తరచూ కదలికలు ఉండే వ్యక్తులతోపాటు ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, విధులకు దూరంగా ఉన్న సిబ్బంది, సెలవులో ఉన్నవారు, క్రమశిక్షణా చర్యల కారణంగా విధులకు దూరంగా ఉన్నవారిని కూడా విచారించారు. ఈ క్రమంలో దాదాపు 36 మంది శిక్షగా విధులకు దూరంగా ఉన్నవారు, 54 మంది సెలవులో ఉన్నవారు, క్రమశిక్షణా చర్యల కారణంగా విధులకు దూరంగా ఉన్న మరో ఏడుగురి వివరాలను పరిశీలించారు. ఆయుధాగారం ఇన్‌చార్జ్ వినోద్‌కుమార్, శ్రీరామ్ ప్రసాద్‌లను కూడా తొలుత అనుమానితులుగా తీసుకుని విచారించారు. అయితే వారి విషయంలో కీలక ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు దర్యాప్తును ఇతర కోణాల్లో కొనసాగించారు. సస్పెన్షన్‌పై ఉన్న సిబ్బంది వివరాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హవల్దార్‌తో పాటు మల్లేష్ కూడా పోలీసుల అనుమానితుల జాబితాలోకి వచ్చాడు.
జూన్ 30న ఆర్మీ నుంచి తొలగింపు.. మల్లేష్‌పై పెరిగిన అనుమానం
మల్లేష్ నేపథ్యాన్ని పరిశీలించిన పోలీసులకు కీలకమైన విషయం తెలిసింది. ఈ ఏడాది జూన్ 30న అతడిని ఆర్మీ విధుల నుంచి తొలగించినట్లు అధికారులు గుర్తించారు. క్రమశిక్షణా రాహిత్యం, ఆరోగ్య సంబంధిత కారణాలతో అతడిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉండటం, ఆయుధాగారం వ్యవస్థపై అవగాహన ఉండటం, ఇటీవలే విధుల నుంచి తొలగించబడటం వంటి అంశాలు పోలీసుల దృష్టిని అతడిపై కేంద్రీకరించాయి. దీంతో మల్లేష్ ఈ చోరీకి పాల్పడటానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత కోపంతో ఆయుధాలను ఎత్తుకెళ్లాడా, డబ్బు కోసం చోరీ చేశాడా, ఆయుధాలను విక్రయించాలనే ఉద్దేశంతో ఈ పని చేశాడా అనే కోణాల్లో విచారణ సాగింది.
సాంకేతిక ఆధారాలతో కీలక లింక్
మల్లేష్ కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అతడి మొబైల్ ఫోన్ వివరాలు, సిగ్నల్స్, కాల్ డేటాతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి పరస్పరం పోల్చారు. ఈ క్రమంలో ఆగస్టు 30 రాత్రి మల్లేష్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు చూపించాయి. ఆయుధాగారం పరిసరాల్లో అతడి కదలికలు ఉండటంతోపాటు ఆ తర్వాత అచ్చంపేట వైపు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి.
ఆగస్టు 28, 29 తేదీల్లోనే బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో అతడు రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఆయుధాగారం వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో నిఘా తక్కువగా ఉంది, ఏ మార్గం ద్వారా లోపలికి వెళ్లవచ్చు, బయటకు రావడానికి ఏ దారి అనువుగా ఉంటుంది అనే విషయాలను ముందుగానే గమనించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఆర్మీలో పనిచేసిన అనుభవం కారణంగా ఆయుధాగారంలో భద్రతా ఏర్పాట్లు, ఆయుధాల నిల్వ ప్రాంతం, లోపలికి వెళ్లే మార్గాలపై అతడికి అవగాహన ఉండే అవకాశం కూడా పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.
భార్య ఫోన్‌తో వెలుగులోకి వచ్చిన నిజం
మల్లేష్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. అతడి భార్య, మామను పిలిపించి అతడి కదలికలు, ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రశ్నించారు. పోలీసులు సేకరించిన ఆధారాలను కుటుంబ సభ్యుల ముందు ఉంచి విచారణ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మల్లేష్ భార్య అతడికి ఫోన్ చేసి గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. పోలీసులు తనపై దృష్టి పెట్టారని తెలుసుకున్న మల్లేష్ చివరకు తానే ఆయుధాలు చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారంతో అచ్చంపేటలోని గడ్డివాములో దాచిన ఆయుధాల ఆచూకీ లభించింది. దీంతో కేసు దర్యాప్తులో కీలకమైన మలుపు చోటుచేసుకుంది.
ఆయుధాల రికవరీతో కేసులో కీలక పురోగతి
మల్లేష్ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు కౌకూర్, యాప్రాల్, అచ్చంపేట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో చోరీకి గురైన నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఇన్‌సాస్ రైఫిల్, 9 ఎంఎం పిస్టళ్లు, నైట్ విజన్ బైనాక్యులర్లు, మ్యాగజైన్లు, సుమారు 1,900 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా చోరీకి గురైన ఆయుధాలు తిరిగి లభించడంతో కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను చోరీ చేయడానికి మల్లేష్ అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది.
పాక్ ఆయుధ డీలర్ లింక్‌పై ఆరా
మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులకు మరో అంశం కనిపించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి చెందిన ఓ ఆయుధాల విక్రేత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మల్లేష్ ఫాలో అవుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ఖాతాలో షాట్‌గన్స్, ఏకే-47 తదితర తుపాకులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా తీసుకున్నారు. మల్లేష్‌కు ఆ వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ఉందా, కేవలం సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడా, చోరీ చేసిన ఆయుధాలను విక్రయించేందుకు ప్రయత్నించాడా, ఇంకెవరైనా మధ్యవర్తులు ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పాక్ ఆయుధ డీలర్‌తో మల్లేష్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. అందువల్ల ఈ అంశం ప్రస్తుతం దర్యాప్తులోని అనుమాన కోణంగా మాత్రమే ఉంది.
మల్లేష్ ఆర్థిక పరిస్థితిపైనా దర్యాప్తు
మల్లేష్ కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడు నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందినవాడిగా అధికారులు గుర్తించారు. అచ్చంపేట సాయినగర్‌లో అతడి తండ్రి నారాయణ నివసిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, మల్లేష్ తరచూ అచ్చంపేటకు వచ్చి వెళ్లడం, అతడి కదలికలను పోలీసులు పరిశీలించారు. నాగర్‌కర్నూల్‌లోని బీసీ కాలనీలో అతడు కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినట్లు కూడా సమాచారం అందడంతో అతడి ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్, పరిచయాలు, సోషల్ మీడియా కార్యకలాపాలను దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.
డ్రగ్ మాఫియా నుంచి స్పై నెట్‌వర్క్ వరకు.. అన్ని కోణాల్లో విచారణ
ఆయుధాల చోరీ నేపథ్యంలో పోలీసులు మొదటి నుంచీ ఏ ఒక్క కోణానికీ పరిమితం కాలేదు. డ్రగ్ మాఫియా ప్రమేయం ఉందా, స్పై నెట్‌వర్క్‌తో ఏదైనా సంబంధం ఉందా, బయటి వ్యక్తులు సహకరించారా, ఆర్మీలోని ఎవరైనా సమాచారం ఇచ్చారా అనే అంశాలను కూడా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, డాగ్ స్క్వాడ్ సాయంతో సేకరించిన ఆధారాలు, వేలిముద్రలు, మొబైల్ సిగ్నల్స్ తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. మల్కాజ్‌గిరి పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ కలిసి దర్యాప్తు చేపట్టడంతో కేసులో ఒక్కో లింక్ బయటపడినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఆయుధాల చోరీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, మల్లేష్‌కు ఇంకా ఎవరెవరు సహకరించారు, పాక్ ఆయుధ డీలర్ లింక్ ఎంతవరకు నిజం, చోరీ చేసిన ఆయుధాలను ఎక్కడికి తరలించాలనుకున్నాడు అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం మల్లేష్‌తోపాటు అతడికి సహకరించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ పూర్తయితే కేసు వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్, ఆయుధాల చోరీకి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
