పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో మౌలిక వసతుల పనులు

భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులపై ప్రత్యేక దృష్టి

పిఠాపురం, ఆంధ్రప్రభ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా సాగుతోంది. పట్టణ రూపురేఖలను మార్చే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మొత్తం రూ.308.24 కోట్ల విలువైన పనులతో పిఠాపురాన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు జరుగుతున్నాయి.

రూ.200 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ

పిఠాపురం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్న భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలోని ప్రధాన చెరుకుల కాలువకు ఇరువైపులా కూడా భూగర్భ మురుగునీటి లైన్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పిఠాపురంలో దశాబ్దాలుగా ఉన్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. మురుగునీరు నిలిచిపోవడం తగ్గడంతో దోమల సమస్యను నియంత్రించడంతో పాటు పట్టణ పరిశుభ్రత మెరుగుపడనుంది. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణలోనూ గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సహకరించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.59.52 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అమృత్‌ 2.0లో భాగంగా రూ.57.37 కోట్లు, టిడ్కో గృహ నిర్మాణ పథకం ఇళ్లకు నీటి సరఫరా కోసం మరో రూ.2.15 కోట్లను కేటాయించారు. పట్టణానికి మొత్తం 120.19 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న 72.90 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో 35 కిలోమీటర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో కొత్తగా అదనంగా 82.29 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రతిపాదించారు. అదే సమయంలో 600 కిలోలీటర్ల సామర్థ్యంతో భారీ ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. మరో 400 కిలోలీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ ట్యాంకు నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. పట్టణ ప్రజలకు కొత్తగా సుమారు 5 వేల తాగునీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు.

పిఠాపురానికి ప్రతిరోజూ నీటి కొరత లేకుండా ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రజల రోజువారీ అవసరాలు 80 లక్షల లీటర్లుగా ఉన్న నేపథ్యంలో.. రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.

శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ

పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశలో భాగంగా పలు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ.4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రాన్ని, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం నిర్మాణ పనులు మరో రెండు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

పిఠాపురం పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి ప్రతిరోజూ సుమారు 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం అందుబాటులోకి వస్తే రోజూ సేకరిస్తున్న 25 టన్నుల చెత్తను శాస్త్రీయ పద్ధతిలో పూర్తిస్థాయిలో నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గతంలో పట్టణంలో పేరుకుపోయిన భారీ మొత్తంలో ఘన వ్యర్థాలను కూడా తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ పనులన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే పట్టణంలో చెత్త సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణతో పాటు రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా రూ.308.24 కోట్ల పెట్టుబడితో పిఠాపురం పట్టణ మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.