INDvsWI | 5/2 నుంచి 351/7కు.. అదిరే కంబ్యాక్ !
- రోహిత్ శర్మ మెరుపులు..
- కేఎల్ విధ్వంసం..
- 129 నాటౌట్‌తో చెలరేగిన కేఎల్
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : వెస్టిండీస్‌తో జరుగుతన్న మూడో వన్డేలో ఆరంభంలో కుప్పకూలినట్లు కనిపించిన భారత్.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకుంది. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి 5/2తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టు.. చివరకు 50 ఓవర్లలో 351/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక దశలో 5/2తో నిలిచిన భారత్.. రెండో వికెట్ తర్వాత ఏకంగా 346 పరుగులు జోడించడం విశేషం. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత ఇన్నింగ్స్ పూర్తిగా మారిపోయింది.
భారత్ ఆరంభం మాత్రం షాక్‌తో మొదలైంది. రెండో ఓవర్‌లో జేడెన్ సీల్స్ శుభ్‌మన్ గిల్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్‌లో విరాట్ కోహ్లీని గోల్డెన్ డక్‌గా బౌల్డ్ చేసి భారత్‌ను 4/2లోకి నెట్టాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి స్కోరు 5/2. అయితే రోహిత్ శర్మ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ క్రమంగా వేగం పెంచాడు. రుతురాజ్ గైక్వాడ్ అతడికి అండగా నిలిచాడు. దీంతో 10 ఓవర్లకు భారత్ 28/2 వద్ద నిలిచింది.
ఆ తర్వాత భారత్ పుంజుకుంది. ఫీల్డింగ్‌లో వెస్టిండీస్ కొన్ని అవకాశాలను చేజార్చడంతో గైక్వాడ్‌కు ఊరట లభించింది. రోహిత్ మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి 132 బంతుల్లో 137 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 58 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 92 పరుగుల వద్ద కీమో పాల్ బౌలింగ్‌లో ఔటయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అప్పటికి భారత్ 141/2తో మెరుగైన స్థితిలోకి వచ్చింది. గైక్వాడ్ 69 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
160/4 వద్ద గైక్వాడ్ కూడా వెనుదిరిగిన తర్వాత కేఎల్ రాహుల్ అసలు దూకుడు మొదలైంది. తన సొంత మైదానంలో ఆడుతున్న నమన్ ధీర్‌తో కలిసి రాహుల్ 43 బంతుల్లో 65 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రాహుల్ కేవలం 41 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. నమన్ ధీర్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటైనా.. నితీశ్ కుమార్ రెడ్డి, అన్షుల్ కాంబోజ్ కేఎల్ రాహుల్ కు అండగా నిలిచారు. వన్డే అరంగేట్రం చేసిన కాంబోజ్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి రెండు సిక్సర్లు బాదాడు. చివరకు 45.4 ఓవర్లలో రనౌట్ అయ్యాడు.
చివరి దశలో రాహుల్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారింది. 87 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు రోహిత్ 85 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. దీంతో 5/2 నుంచి భారత్ 351/7కు చేరుకుంది. వెస్టిండీస్‌పై సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఈ భారీ స్కోరు బలమైన పునాదిగా మారింది.
