పరిశ్రమలే ప్రాణం.. రాయలసీమ అభివృద్ధికి పారిశ్రామిక రంగమే ఆధారం

కరువు ప్రాంతాల అభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటు కీలకమన్న శ్రీనివాస్ రెడ్డి

రాయదుర్గం (ఆంధ్రప్రభ): రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటు ఎంతో కీలకమని రాయలసీమ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయదుర్గం ప్రాంతంలో గాలి మరల రెక్కల పరిశ్రమ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాంత ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక రంగం ప్రాణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యువగళం రథసారథి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాయలసీమ అభివృద్ధికి తనదైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ క్రాసింగ్ ప్రాంతంలో భారీ పెట్టుబడులతో పవన విద్యుత్ పరిశ్రమ ఏర్పాటు కానుండటం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సుదూర ప్రాంతంగా ఉన్న రాయదుర్గం కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరేలా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమ భవిష్యత్తుకు దోహదపడతాయని అన్నారు.