పేరుకే పరిశ్రమలు.. యూనిట్లు నిల్.. పారిశ్రామిక భూములపై కాగ్ సంచలన నివేదిక
- పారిశ్రామిక భూముల కేటాయింపుల్లో లోపాలు
- 225 సంస్థల భూ కేటాయింపులు రద్దు.. 1,964 ఎకరాలు వెనక్కి
- గచ్చిబౌలిలో ఖాళీగా ఉన్న విలువైన పారిశ్రామిక స్థలాలు
- ఐదేళ్లయినా యూనిట్లు ఏర్పాటు చేయని మొబైల్ కంపెనీలు
- కాగ్ అభ్యంతరాలతో తెరపైకి వచ్చిన పారిశ్రామిక భూముల వ్యవహారం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పరిశ్రమలు వస్తాయి.. పెట్టుబడులు పెరుగుతాయి.. వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్న లక్ష్యంతో ప్రభుత్వం విలువైన భూములను పారిశ్రామిక సంస్థలకు కేటాయిస్తోంది. కానీ భూములు తీసుకున్న పరిశ్రమ యాజమాన్యాలు ఏళ్ళ తరబడి ఖాళీగా ఉంచుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ భూమిని తిరిగి తీసుకోవాలి. తెలంగాణలో కొన్ని కీలక కేటాయింపుల విషయంలో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదని తాజాగా 2025-26లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బయటపెట్టిన అంశాలు పారిశ్రామిక భూముల వ్యవహారాన్ని మరోసారి చర్చకు దారితీశాయి.
పారిశ్రామిక ఊతం ఇవ్వాలన్న లక్ష్యంతో 2014లో టీజీఐఐసీ (తెలంగాణా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. 2014-15 నుంచి 2021-22, 2024-25 కాలంలో అప్పటి తెలంగాణా స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ 2,355 కేటాయింపుల ద్వారా సుమారు 4,050 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించింది. వీటి విలువ రూ.2,811.06 కోట్లు కాగా ఆయా ప్రాజెక్టుల ద్వారా రూ.32,566 కోట్ల పెట్టుబడులు, సుమారు 1.71 లక్షల మందికి ఉపాధి వస్తుందని అంచనా వేశారు.
కేటాయింపుల విధానం, రాయితీలు, అవసరానికి మించి భూములు ఇవ్వడం, కొన్ని సంస్థలు యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై ప్రతి ఏడాది కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. 2022 జనవరిలో అప్పటి టీఎస్‌ఐఐసీ సుమారు 225 కంపెనీలకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేసి దాదాపు 1,964 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక సమాచారాన్ని ఉటంకిస్తూ అప్పట్లో వెల్లడైంది.
బౌలిలో విలువైన భూములు
టీజీఐఐసీ నివేదికలో అత్యంత కీలకంగా కనిపిస్తున్న అంశాల్లో గచ్చిబౌలి ఇండస్ట్రియల్ పార్క్ భూముల వ్యవహారం ఒకటి. మొబైల్ తయారీ సంస్థ – భగవతి ప్రొడక్ట్ లిమిటెడ్(మైక్రోమాక్సు)కు గచ్చిబౌలి పారిశ్రామిక పార్కులో ఒక ఎకరం భూమిని 2017లో ఎకరాకు రూ.10.05 కోట్ల చొప్పున కేటాయించారు. అప్పటి ప్రాథమిక మార్కెట్ విలువ ఎకరాకు రూ.14.52 కోట్లుగా ఉన్నప్పటికీ తక్కువ ధరకు కేటాయించడం వల్ల టీఎస్‌ఐఐసీకూ రూ.4.47 కోట్ల నష్టం జరిగినట్లు గత ఆడిట్లోనే పేర్కొన్నారు.
ఆ తర్వాత అదే రూ.10.05 కోట్ల ధర ప్రాతిపదికన మరో 2.68 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను మూడు మొబైల్ తయారీ సంస్థలకు కేటాయించారు. దీనివల్ల మరో రూ.12 కోట్ల మేర ఆదాయ నష్టం జరిగిందని తాజా కాగ్ నివేదిక పేర్కొంది. కీలకమైన విషయం ఏమిటంటే మైక్రోమాక్స్, సెల్ కాన్, కార్బన్ సంస్థలు భూములు పొందిన తర్వాత ఐదేళ్లు గడిచినా, 2022 డిసెంబర్ నాటికి తమ యూనిట్లను ఏర్పాటు చేయలేదని కాగ్ గుర్తించింది.
