ఇంద్రకీలాద్రిపై నేడు ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేత
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలు బంద్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వరుస సెలవులు, గాంధీ జయంతి నేపథ్యంలో శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రిపై రద్దీ నెలకొంది. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 4) ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వి.కె. శీనానాయక్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కనకదుర్గనగర్ వైపు వాహనాల రాకపోకలపై నియంత్రణ
భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం కనకదుర్గనగర్ వైపు వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను వినియోగించనున్నట్లు చెప్పారు. లిఫ్ట్ మార్గాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామని, సాధారణ భక్తులు మహామండపం ర్యాంప్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లులు రద్దీ తక్కువగా ఉండే సమయాలను ఎంచుకోవాలని కోరారు. ఉదయం 8 గంటలలోపు లేదా సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య ఇంద్రకీలాద్రికి రావాలని సూచించారు. దేవస్థానం చేపడుతున్న రద్దీ నియంత్రణ ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనానాయక్ విజ్ఞప్తి చేశారు.
