Indrakeeladri | ఆన్లైన్ సేవల్లో అగ్రస్థానం..

Indrakeeladri | ఆన్లైన్ సేవల్లో అగ్రస్థానం..
- ఆన్లైన్ టికెట్లు, సేవల్లో టాప్ గా…
- శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి దక్కిన గౌరవం
- ఐవీఆర్ఎస్ లోనూ ప్రశంసలు…
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : మారుతున్న కాలం.. అందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కనకదుర్గమ్మ వారి ఆలయం ఆన్లైన్లో అత్యుత్తమ సేవలను అందిస్తుంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా.. సులభతరంగా.. ఫింగర్ టిప్స్ పై అన్ని సేవలను ఆన్లైన్లో అందుబాటులో తీసుకురావడంతో ప్రారంభించిన అణచికాలంలోనే రాష్ట్రంలోనే అగ్రగామిగా దేవస్థానం నిలిచింది.
పారదర్శకతలో పోటీపడుతూ… సేవలో మేటి అనిపించుకుంటూ… భక్తులతో ప్రశంసలు అందుకుంటూ ఆన్లైన్ టికెట్లు సేవల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రథమ స్థానంలో నిలిచింది. భక్తుల అభిప్రాయాలు.. సూచనలు సలహాలను పలు విధాలుగా సేకరిస్తూ ముఖ్యమైన ఐవీఆర్ఎస్ లో కూడా ప్రశంసలు అందుకుంటుంది.
ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ కే.రామచంద్ర మోహన్ ఆదేశాలతో ఇటేవలె అన్ని సేవలను ఆన్లైన్ లో అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ సేవల కోసం అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లను దాత బహుకరించగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కాష్ లెస్ ఆన్లైన్ సేవలను అందుబాటులో ఉంచారు.
ముఖ్యంగా ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ సమగ్ర సమాచారాన్ని అందించే ప్రత్యేక యాప్ ను రూపొందించడంతో పాటు అన్ని సేవా టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ విధానంతో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు ఎక్కడ అధికారులు ఇతర సిబ్బంది అవినీతికి చోటు ఇవ్వని విధంగా మార్పులు చేశారు.
అన్ని దేవాలయాలను పక్కనపెట్టి…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలను ఆన్లైన్ సేవలలో అధిగమించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అగ్రగామిగా నిలిచింది. ఆన్లైన్ సేవలను పూర్తిస్థాయిలో విస్తరించిన అతి కొద్ది రోజులలోనే దేవస్థానం ప్రథమ స్థానంలో నిలవడం దేవాదాయ శాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆన్లైన్ సేవ విభాగానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన పది దేవస్థానాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అగ్రగామిగా నిలిచింది. మునుపెన్నడూ ఊహించని విధంగా అత్యధికంగా గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి దర్శనం అన్ని సేవలకు సంబంధించి 4218 ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించిన దేవస్థానం అగ్రగామిగా నిలిచింది.
తరువాతి స్థానంలో శ్రీశైలం మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, మూడవ స్థానంలో అన్నవరం, నాలుగవ స్థానంలో శ్రీకాళహస్తి, ఐదవ స్థానంలో వాడపల్లి తరువాత కాణిపాకం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల వంటి దేవాలయాలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై ఇప్పుడిప్పుడే అందు బాటిల్ లోకి వస్తున్న ఈ ఆన్లైన్ సేవలు మరింత విస్తృతం చేస్తే రానున్న రోజులలో నిరంతరం అగ్రస్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
భక్తుల నుండి ప్రశంసలు…
దేవస్థానంలో సులభతరంగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల భక్తుల నుండి ఆలయ అధికారులకు సిబ్బందికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అవినీతికి ఆస్కారం ఉండే విధంగా ఉన్న సేవల స్థానంలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చే క్రమంలో అన్ని ఆన్లైన్ చేసిన నేపథ్యంలో ఎక్కడ అవినీతికి చోటు లేకుండా ఉండడం, లావాదేవీలు సైతం సులభతరం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి సేవలు ఆన్లైన్లో అందుబాటు రావడంతో భక్తులు కూడా ముందస్తుగా వారి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసుకోవడంతో వారికి అమ్మవారి దర్శనం కూడా సులభతరమవుతుంది. ఎక్కువసేపు క్యూ లైన్ లో వేచి ఉండకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం కూడా వారికి కలుగుతోంది. దీనికి తోడు అమ్మవారి పూర్తి ఆలయ సమాచారం క్షణక్షణం మారుతున్న పరిస్థితులు భక్తుల రద్దీ వంటి సమాచారం అందుబాటులోకి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
