కొండచరియలపై నిరంతర నిఘా
భక్తుల భద్రతకు పెద్దపీట..
ఘాట్ రోడ్డు, డ్రైనేజీపై ఈవో పరిశీలన
విజయవాడ, ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : అకాల భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలు, ఘాట్ రోడ్డు, రిటైనింగ్ వాల్స్, డ్రైనేజీ వ్యవస్థను దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ గురువారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాల అధికారులతో కలిసి కొండపై పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణం నుంచి పరిశీలన ప్రారంభించిన ఈవో.. చిన్న రాజగోపురం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు.
అనంతరం ఘాట్ రోడ్డుపై కాలినడకన ఓం టర్నింగ్ వరకు వెళ్లి కొండచరియలు జారిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ వలలు, రక్షణ గోడల పరిస్థితిని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల సమయంలో కొండపై నుంచి మట్టి, రాళ్లు జారిపడే ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గతంలో కొండచరియలు జారిన ప్రాంతాలతో పాటు ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ఇనుప రక్షణ వలలు, రక్షణ గోడలను ఇంజినీరింగ్ సిబ్బంది తరచూ తనిఖీ చేయాలని సూచించారు.
ఎక్కడైనా మట్టి, రాళ్లు రహదారిపైకి వస్తే వెంటనే తొలగించేలా సిబ్బందిని, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. ఘాట్ రోడ్డులో కొనసాగుతున్న మరమ్మతు పనుల పురోగతిని సమీక్షించారు. వర్షపు నీరు రహదారిపై నిలిచిపోకుండా డ్రైనేజీ మార్గాల ద్వారా దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నపాటి అవరోధాలు ఏర్పడినా వెంటనే తొలగించి వాహనాలు, భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
కనకదుర్గనగర్ ప్రాంతంలో కొండపై నుంచి వచ్చే వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఈవో.. నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ అవుట్లెట్లను తనిఖీ చేశారు. పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని పరిశీలించిన ఈవో శీనా నాయక్.. ప్రస్తుతం మహామండపం ఆరో అంతస్తులో కొనసాగుతున్న దేవస్థానం ప్రధాన స్టోర్స్ విభాగాన్ని కొత్త అన్నదాన భవనం సెల్లార్‌లోని విశాల ప్రాంగణానికి తక్షణమే తరలించాలని అధికారులను ఆదేశించారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు కొండపై అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అక్టోబరు 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని వర్షాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఘాట్ రోడ్డు, డ్రైనేజీ, రిటైనింగ్ వాల్స్, కొండచరియలు జారే ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఈవో ఆదేశించారు. పరిశీలనలో దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
