కార్తీకం.. భవానీ దీక్షలకు సర్వం సిద్ధం!
నవంబరు 10 నుంచి కార్తీక మాస ప్రత్యేక పూజలు..
20 నుంచి భవానీ దీక్షాధారణలు
కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, కలశజ్యోతి మహోత్సవానికి ఏర్పాట్లు..
లక్షలాది భక్తుల రాకకు కార్యాచరణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: కార్తీక మాస ప్రత్యేక పూజలు, భగినీ హస్తభోజనం సందర్భంగా అమ్మవారికి నిర్వహించే గాజుల అలంకారోత్సవం, వార్షిక భవానీ దీక్షా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. నవంబరు 10 నుంచి కార్తీక మాస పూజలు, 11న అమ్మవారి విశేష గాజుల అలంకారోత్సవం, 20 నుంచి భవానీ దీక్షాధారణలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 24న కలశజ్యోతి మహోత్సవం, డిసెంబరు 30 నుంచి జనవరి 3 వరకు దీక్షా విరమణలు నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర అంశాలపై దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ ఏర్పాట్లపై గురువారం దేవస్థానం పరిపాలనా భవనంలో ఈవో వి.కె. శీనా నాయక్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్తీక మాసంలో ఆకాశదీపం, నిత్య అభిషేకాలు, బిల్వార్చనలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నవంబరు 11న గాజుల అలంకారోత్సవానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో సౌకర్యాలు కల్పించి, ప్రసాద వితరణకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
భవానీ దీక్షల సందర్భంగా కేశఖండనశాలలు, స్నానఘట్టాలు, తాగునీరు, నిరంతర అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాద నిల్వలకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈవో సూచించారు. దీక్షా విరమణ సమయంలో హోమగుండాల వద్ద భద్రతను పటిష్టం చేయాలని, ఇంజినీరింగ్, భద్రతా విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమష్టి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఈఈ రమాదేవి, ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
