వైభవంగా ఆదిదంపతుల దివ్య రథోత్సవం

అన్నపూర్ణాదేవి అలంకారంలో జగన్మాత.. ప్రదోష వేళ మల్లేశ్వరుడితో నగరోత్సవం

కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించిన చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్‌

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిపారవశ్యంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన మంగళవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్య నగరోత్సవం వైభవంగా జరిగింది. కొండపై శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుండగా.. ప్రదోష వేళ ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వరుల రథోత్సవం కనులపండువగా సాగింది. విద్యుద్దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లు పురవీధుల్లో విహరించడంతో భక్తులు పరవశించిపోయారు.

కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభం

కొండపై మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. అర్చకులు, అధికారులు, భక్తుల సమక్షంలో ఆదిదంపతుల రథయాత్ర ముందుకు సాగింది.

మేళతాళాలు.. కళారూపాల కోలాహలం

నగరోత్సవంలో సంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాక్సోఫోన్‌ మధుర స్వరాలు, కేరళ పంచవాద్యాల మేళం, మహిళా భక్తుల కోలాటాలు, జానపద గరగ నృత్యాలు ఊరేగింపునకు మరింత శోభను చేకూర్చాయి. కళాకారుల ప్రదర్శనలు, మేళతాళాల నడుమ పురవీధులు మార్మోగాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు మార్గమధ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అడుగడుగునా హారతులు.. నీరాజనాలు

మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరిన రథయాత్ర కనకదుర్గా నగర్‌, రథం సెంటర్‌ మీదుగా వన్‌టౌన్‌ వినాయకుడి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి కెనాల్‌ రోడ్డు మీదుగా ఘాట్‌ రోడ్డు ద్వారా తిరిగి కొండపైకి చేరుకోవడంతో నగరోత్సవం పూర్తయింది. రథంపై విహరిస్తున్న ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు దారిపొడవునా బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ స్వామి, అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు పలికారు.

ఆధ్యాత్మిక విశిష్టతతో నగరోత్సవం

శరన్నవరాత్రుల ప్రదోష వేళలో అన్నపూర్ణాదేవి సమేత మల్లేశ్వర స్వామివార్లను రథంపై దర్శించుకోవడం పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఆదిదంపతుల నగరోత్సవం నగరానికి శాంతి, శుభాలు కలిగిస్తుందని సంప్రదాయంగా భావిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సౌభాగ్యం కలగాలని భక్తులు ప్రార్థించారు.

నగరోత్సవం సజావుగా సాగేందుకు దేవస్థానం భద్రతా విభాగం, విజయవాడ నగర పోలీసు యంత్రాంగం సమన్వయంతో ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.