ఉట్నూర్‌లో రేపు మంత్రి జూపల్లి పర్యటన
- ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం.. రాజులకోట అభివృద్ధి పనుల పరిశీలన
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం పర్యటించనున్నట్లు ఐటీడీఏ అధికారులు తెలిపారు. మంత్రితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటనలో పాల్గొననున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
మంత్రి జూపల్లి కృష్ణారావు పుత్తూరు మండలంలోని మత్తడిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం ఉట్నూర్‌లోని రాజులకోటలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించనున్నారు.
మిస్ హెల్త్ వాటర్ ఇండియా విజేత కుటుంబంతో భేటీ
ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ముండే ప్రీతి మిస్ హెల్త్ వాటర్ ఇండియా-2026 అందాల పోటీలో ఎంపికైన నేపథ్యంలో మంత్రి ఆమె కుటుంబ సభ్యులను కలవనున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు.
