పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎంపీడీఓ సంతోష్‌కుమార్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు వరంగా మారుతోందని ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్ అన్నారు.
భీమ్‌గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో నూతనంగా మంజూరైన ఎనిమిది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇల్లు మంజూరైన ఓ లబ్ధిదారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. తమ సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమ, ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఏ కలీం, తోట శంకర్, మల్లెల లక్ష్మణ్, పర్స అనంతరావు, అరిగెల జనార్ధన్, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
