పేదల సొంతింటి కలకు అడుగు ముందుకు

పెద్దమ్మకాడి తండాలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా భీమ్‌గల్‌ మండలం పెద్దమ్మకాడి తండా గ్రామపంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ రావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచ్‌ భూక్యా రమేష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్‌ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. నేనావత్‌ మీరా, భూక్యా కళావతి, సేవ్య భూక్యా, మంజుల, జీవన్‌లకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం ద్వారా పేద కుటుంబాలకు భద్రతతో కూడిన నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో చేంగల్‌ సర్పంచ్‌ దుమల మమత, బాబాపూర్‌ ఉపసర్పంచ్‌ మంద గవర్ధన్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి మమత, పెద్దమ్మకాడి తండా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు భూక్యా గణేష్‌, నేనావత్‌ శంకర్‌, భూక్యా సేవ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.