semi final | లేదంటే ఇంటి దారే..!

semi final | లేదంటే ఇంటి దారే..!
- భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టం
- దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి..
- టీమిండియాకు పూర్ రన్‌రేట్
- మిగిలిన రెండు మ్యాచులు తప్పక గెలవాల్సిందే.
- భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్‌కు..
semi final | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌నకు ముందు జరిగిన అన్ని సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. ఈ జోరును చూసి వరల్డ్ కప్‌లో మనకు తిరుగులేదనుకున్నారందరు. మన ఆటగాళ్ల ఆటను చూసి ఈ సారి కూడా కప్ మనదే అనుకున్నారు. కానీ వరల్డ్ కప్‌లో టీమిండియా ఆటను చూసిన తర్వాత కప్ సంగతి తర్వాత.. ఈ జట్టు కనీసం సెమీస్‌కు అయినా చేరుతుందా అనిపిస్తుంది. గ్రూప్ దశలో చిన్నచిన్న జట్ల మీద కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు మ్యాచులను గెలిచింది. ఏ జట్టుపైనా తన ఆధిపత్యాన్ని చూపలేకపోయింది. బ్యాటింగ్‌లో అయితే మరీ ఘోరం. నిలకడ లేక ఒకరిద్దరి మీద ఆధారపడాల్సి వచ్చింది. సమిష్టిగా బ్యాటింగ్ చేసింది ఒక్కటి కూడా లేదు. విధ్వంసక స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అయితే సున్నాల మీద సున్నాలేసుకున్నాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగిపోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక బౌలర్ల సంగతి చెప్పుకుంటే … వారు బౌలింగ్ చేయడమే మరిచిపోయారన్నట్టుగా ఉంది. ఇలాంటి ఆటతో కప్ కొట్టుకొస్తదనుకోవడం తెలివి తక్కువ తనమే అవుతుంది. ఇప్పటికైనా టీమిండియా ఆటగాళ్లు ఆట మార్చకుంటే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది.

ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. గట్టి జట్టు ఎదురైతే చేతులేత్తేస్తామని నిరూపించారు. ఆడుతుందని సొంత గడ్డ మీద అయినా… మన ఆటగాళ్లు కంగారు పడ్డారు. ఈ ఒక్క ఓటమి కారణంగా టీమిండియా ఇప్పుడు సెమీ ఫైనల్ చేరడం కష్టమై పోయింది. సూపర్ 8లో భాగంగా టీమిండియా తన తర్వాతి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా విజయం సాధించాలి. గెలవడమే కాదు.. రన్ రేట్ కూడా పెంచుకోవాలి. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా రన్ రేట్ -3.800 గా ఉంది. మిగిలిన వెస్టిండీస్ అలాగే జింబాబ్వే పైన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది టీమిండియా. ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించడమే కాకుండా.. రన్ రేట్ కూడా చాలా కీలకంగా అని ఉంది.

ఇలా అయితేనే చాన్స్
అయితే ఈ రన్ రేట్ తో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లడం చాలా కష్టం. కాబట్టి జింబాబ్వే, వెస్టిండీస్ పైన భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు రన్ రేట్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలోకి ఆరు పాయింట్లు వస్తాయి. ఇటు టీమిండియా కు నాలుగు పాయింట్లు వస్తాయి. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు తమ సూపర్ 8 మ్యాచ్ లలో ఒకటికంటే ఎక్కువ గెలవకూడదు. ఇన్ని కండిషన్లు సెట్ అయితేనే టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.

జింబాబ్వే యమా డేంజర్..
టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వే భయంకరంగా ఆడుతోంది. గ్రూప్ దశలో ఇప్పటికే శ్రీలంక, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అలాంటి జింబాబ్వేను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇటు వెస్టిండీస్ లాంటి భయంకరమైన జట్టును తక్కువ అంచనా వేయకూడదు.

అమీర్ జోస్యం నిజమవుతుందా?
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ ఈసారి సెమీఫైనల్ చేరడం కష్టమని, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాయని అమీర్ టోర్నీకి ముందే జోస్యం చెప్పాడు. అప్పట్లో భారత అభిమానులు ఈ కామెంట్లను కొట్టిపారేసినప్పటికీ.. తాజా ఫలితాలు అమీర్ అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయని సూచిస్తున్నాయి. స్టూడియోలో కూర్చుని అమీర్ విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు భారత్‌కు ఓ రకమైన ఒత్తిడిని కలిగిస్తోంది.
