Indian Stock Market Today | 1,580 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌.. 24,400 దాటిన నిఫ్టీ!

Indian Stock Market Today |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, బిజినెస్ ప్ర‌తినిధి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమై దూసుకెళ్తున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా పుంజుకున్నాయి. ఆటో, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లలో సందడి నెలకొంది. ఉదయం 10.02 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,583.46 పాయింట్లు (2.05 శాతం) పెరిగి 78,884.86 వద్దకు చేరింది. నిఫ్టీ 448.80 పాయింట్లు (1.87 శాతం) లాభంతో 24,409.40 వద్ద కొనసాగింది.

లాభాల్లో ఎక్కువ షేర్లు

మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం 2,815 షేర్లు లాభాల్లో ఉండగా.. 632 షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మరో 148 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా ఒక్కో శాతం చొప్పున పెరిగాయి. బ్యాంక్‌ నిఫ్టీ 2.02 శాతం లాభంతో 57,045.10 స్థాయికి చేరింది.

ఆటో, బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌

రంగాల వారీగా చూస్తే అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఆటో రంగం 2.5 శాతం పెరిగి ముందంజలో నిలిచింది. నిఫ్టీలో ష్రిరామ్‌ ఫైనాన్స్‌ 5.93 శాతం, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 5.01 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 4.65 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 4.21 శాతం లాభపడ్డాయి.

బ్యాంకింగ్‌ షేర్లలోనూ కొనుగోళ్లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.86 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.31 శాతం, ఎస్‌బీఐ 1.66 శాతం పెరిగాయి. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్‌ 2.27 శాతం, టెక్‌ మహీంద్రా 2.77 శాతం లాభాలతో ట్రేడయ్యాయి.

మిడ్‌క్యాప్‌ షేర్లలోనూ సందడి

మిడ్‌క్యాప్‌ షేర్లలో అశోక్‌ లేలాండ్‌ 7.51 శాతం పెరిగింది. ఎస్‌బీఐ కార్డ్‌ 5.78 శాతం, హడ్కో 5.37 శాతం, అపోలో టైర్స్‌ 4.81 శాతం, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 4.73 శాతం లాభపడ్డాయి. లెన్స్‌కార్ట్‌ షేరు కూడా ఐదు శాతానికి పైగా పెరిగింది.

అయితే కొన్ని షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. కమ్మిన్స్‌ ఇండియా షేరు భారీగా పడిపోయింది. హిటాచీ ఎనర్జీ ఇండియా 3.61 శాతం, ఏబీబీ ఇండియా 2.53 శాతం నష్టపోయాయి. పీఐ ఇండస్ట్రీస్‌ షేరు కూడా భారీగా తగ్గింది.

అమెరికా పరిణామాలు.. భారత్‌కు ప్రయోజనమా?

అమెరికాలో చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయా అనేది మార్కెట్ నిపుణుల్లో చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఏఐ కంపెనీలు, డేటా సెంటర్లపై ఆంక్షలు, అదనపు పన్నుల ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇతర దేశాల మార్కెట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల భారత్‌కు విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవంబర్‌లో విదేశీ పెట్టుబడుల రాక ప్రారంభం కావడం కొంత ఆశాజనకంగా ఉంది.

అయితే అమెరికా ఏఐ షేర్లలో భారీ పతనం వస్తే ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరించారు. అందువల్ల ప్రస్తుత లాభాల‌ను చూసి తొందరపడి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా మార్కెట్‌ పరిస్థితులను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.