దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు చ‌రిత్ర‌ సృష్టించింది. ఒక రోమాంచితమైన ఫైనల్‌లో బలమైన ఫ్రాన్స్ జట్టును 235-233 తేడాతో ఓడించి, చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. రిషభ్‌ యాదవ్‌, అమన్‌ సైనీ, ప్రథమేశ్‌లతో కూడిన ఈ త్రయం దేశానికే గర్వకారణంగా నిలిచింది. వారి అద్భుతమైన ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

టోర్నీలో భారత్ జ‌ర్నీ…

భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించింది.. రౌండ్ ఆఫ్ 16 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 232 పాయింట్లతో స్కోరు సమం కావడంతో, షూట్-ఆఫ్‌లో 30-28 తేడాతో విజయం సాధించారు. ఆ త‌రువాత క్వార్టర్ ఫైనల్ లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అమెరికాను 234-233 తేడాతో ఓడించారు.

సెమీ ఫైనల్ చేరుకున్న భార‌త్… టర్కీ జట్టుపై 234-232 పాయింట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఇక‌ ఫైనల్ ఫైట్ లో… ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో.. తొలి మూడు సెట్ల తర్వాత స్కోరు 176-176గా సమం అయింది.

అయితే, నిర్ణయాత్మకమైన చివరి సెట్‌లో భారత ఆటగాళ్లు 59 పాయింట్లు సాధించగా, ఫ్రాన్స్ 57 పాయింట్లతో వెనుకబడింది. దీంతో భారత్ రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం..

ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కూడా మెరిసింది. జ్యోతి సురేఖ వెన్నం, రిషబ్ యాదవ్‌ల జోడీ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో తలపడి 155-157 తేడాతో ఓడిపోయి రజత పతకం సాధించింది. 23 ఏళ్ల రిషబ్ యాదవ్ ఈ టోర్నమెంట్‌లో ఒక రజతం, ఒక స్వర్ణ పతకాన్ని సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.

Leave a Reply