అమెరికాలో భారతీయులపై అక్రమ వలసల ముద్ర.. ఐసీఈ ఆగడాలపై ఆందోళన
అక్రమ వలసదారులనే ముద్ర..
భారతీయుల అరెస్టులు, నిర్బంధాలు
4,800 మంది భారతీయుల వెనక్కి పంపింపు
జూలైలో 51 వేల అరెస్టులు
15 ఏళ్లలో 15,756 మంది భారతీయుల బహిష్కరణ
సక్రమ మార్గాల్లో వెళ్లినా అక్రమ వలసదారులుగా పరిగణిస్తున్నారన్న ఆవేదన
కుక్కను చంపాలంటే దాని మీద పిచ్చిది అనే ముద్ర వేయాలి. సరిగ్గా ఇలాంటి అమానవీయమైన వలస విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉంటున్న భారతీయులపై రుద్దుతున్నారు. కేవలం కోవిడ్ మహమ్మారి కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు వెనక్కి వస్తామంటే ససేమీరా అన్న ఉదంతాలు కోకొల్లలు. పోనీ ఏళ్ల తరబడి కన్నవారిని, సొంత భూమిని నేరుగా వచ్చి చూడకుండా అమెరికానే అంటిపెట్టుకున్నవారి పరిస్థితి ఏమైనా బాగుంటే అదీ లేదు. భారతీయులు కనిపిస్తే చాలు వారి మీద ఏదో ఒక కారణంతో అక్రమ వలసదారులు అనే ముద్రను వేయడానికి అమెరికా అధికారులు వాలిపోతున్నారు.
అమెరికా దేశానికి వలసల నియంత్రణ కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అనే ప్రభుత్వ విభాగం అమెరికా అధ్యక్షుడికి పిచ్చివాడి చేతిలో రాయిలా మారింది. ట్రంప్ రెండవ పర్యాయం అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీఈ ఆగడాలు మితిమీరిపోయాయి. భారతీయుల అరెస్టులు, నిర్బంధాలు, బలవంతంగా స్వదేశానికి వెనక్కి పంపించడాలు ఐసీఈ దినచర్యలో భాగమైపోయాయి.
ఇదేదో అమెరికా అంటే పడని వారు చేస్తున్న ఆరోపణలు కాదు. స్టాప్ ఏఏపీఐ హేట్ అనే ఎన్జీవో గణాంకాలతో సహా చెబుతున్న అక్షర సత్యాలు. ఈ ఏడాది అర్ధ భాగంలో 1,273 మంది భారతీయులను స్వదేశానికి పంపించివేశారు. గత సంవత్సరం ఇలా వెనక్కిపోయినవారి సంఖ్య 3,567గా ఉంది. ఆ లెక్కన చూస్తే ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వదేశానికి నిర్బంధంగా వెనుదిరిగిన భారతీయుల సంఖ్య 4,800గా నమోదైంది.
ఇక అరెస్టుల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఒక్క జూలై మాసంలోనే 51 వేల మందిని అరెస్టు చేశారు. అలా రోజుకు 2,000 అరెస్టులతో సరికొత్త రికార్డును అమెరికా అధ్యక్షుడు సృష్టించారు. అమెరికాలో ఇతర దేశాలవారూ, జాతుల వారూ జీవిస్తున్నప్పటికీ, భారతీయులను టార్గెట్ చేసుకుని ఇలా వెనక్కి పంపడం జరుగుతున్నదని అధికారులు తెలిపారు.
అయితే, ఇలా వెనక్కి పంపడం కొత్త కాదని, గడిచిన 15 సంవత్సరాల్లో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపినట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలియజేశారు. అమెరికాలో పెద్ద ఉద్యోగాలకు వెళ్లినవారికి ఇది వర్తించదు. అయితే, ఇతర దేశాలకు చెందిన వారు కూడా అమెరికాలో అక్రమంగా ప్రవేశించి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తున్న వారున్నారు. అక్రమ వలసదారులని గుర్తించినవారిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి పంపిస్తున్నారు.
అక్రమ వలసదారుల్లో ఇతర దేశాల నుంచి వచ్చి భారతీయులమని చెప్పుకున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిని పౌరసత్వం నిర్ధారణ తర్వాతనే వెనక్కి పంపుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుపుతున్నారు. రష్యాలో కూడా అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు.
అయితే, భారతీయులు సక్రమ మార్గాల ద్వారానే విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారనీ, వీరిలో చాలా మంది ఆయా దేశాల్లోని కంపెనీల నుంచి ఉద్యోగ నియామక పత్రాలు అందిన తర్వాతనే వెళ్తున్నారని విదేశాంగ అధికారులు వివరణ ఇచ్చారు. అక్కడ ఉద్యోగ నియామక పత్రాలు అందిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారనీ, అలా వచ్చిన వారిని కూడా అక్రమ వలసదారులుగా అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిగణిస్తున్నారని ఉద్యోగాల నిమిత్తం వెళ్లినవారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
