భారత వైమానిక దళంలో యువతకు ఉద్యోగావకాశాలు

అగ్నివీర్ వాయు, ఎయిర్‌మెన్‌గా సేవలందించే అవకాశం
డిసెంబర్ 6న నంద్యాలలో అవగాహన కార్యక్రమం
16 నుంచి 22 ఏళ్ల యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి : జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైమానిక దళంలో యువతకు లభించే ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 6న నంద్యాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో భారత వైమానిక దళానికి చెందిన 12వ ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ ప్రతినిధులు శేఖర్, నిధీష్‌లు కలెక్టర్‌ను కలిసి కార్యక్రమానికి సంబంధించిన అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అనువైన వేదిక కేటాయించాలని ప్రతినిధులు కోరారు. జిల్లాలోని కళాశాలల నుంచి విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు బందోబస్తు, వైద్య, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచేలా జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా జిల్లాలోని యువతకు భారత వైమానిక దళంలోని అగ్నివీర్ వాయు, ఎయిర్‌మెన్ ఉద్యోగావకాశాలు, అర్హతలు, ఎంపిక విధానంపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. 16 నుంచి 22 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేశ రక్షణలో భాగస్వాములయ్యే దిశగా యువతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.