ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
అగ్నివీర్ వాయులో గొప్ప ఛాన్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్సు లో ఉద్యోగాలు రెడీ
మార్చిలో భారతీయ వాయుసేన ఓపెన్ ర్యాలీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహణ
భారత వాయు సేన భర్తీ అధికారి వింగ్ కమాండర్ యాకూబ్ అలీ
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్చ్ నెలలో భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) లో “అగ్ని వీర్ -వాయు” గా భర్తీ చేసేటందుకు ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ని నిర్వహించబోతున్నట్లు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల భర్తీ అధికారి , సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ అయిన వింగ్ కమాండర్ షేక్ యాకుబ్ అలీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ను సచివాలయంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. మన రెండు తెలుగు రాష్ట్రాల యువతకు భారతీయ వాయు సేనలో జాయిన్ అవ్వడానికి ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ద్వారా అదనపు అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. దానికి ఛీఫ్ సెక్రటరీ తమవంతు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటారు జిల్లా కలెక్టర్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి & సీఈవో కు దీని గురించి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ తో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించడానికి అనుమతి కోరమని, వెంటనే మనస్పూర్వకంగా అంగీకరించారని చెప్పారు.

ఇంటర్, తత్సమాన విద్యార్హతలు (పాలిటెక్నిక్, ఐటిఐ) గల విద్యార్థిని, విద్యార్థులు “అగ్ని వీర్ -వాయు” గా భారత వాయుసేనలో చేరవచ్చని చెప్పారు. 17 1/2 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగల యువతీ, యువకులు దీనికి అర్హులన్నారు. చిన్న వయసులోనే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తామని తెలిపారు.

