India-Us-Trade-Deal-90-Percent : 90 శాతం ఓకే Andhra Prabha Top News
India-Us-Trade-Deal-90-Percent : 90 శాతం ఓకే Andhra Prabha Top News
- ఇండో అమెరికా వాణిజ్య డీల్..
- తుది మెరుగుల్లో అధికారులు బిజీబిజీ
- త్వరలోనే కీలక ప్రకటన..
- ద్వైపాక్షిక బంధాలకు కొత్త ఊపు
- త్వరలో రుబియో భారత్ పర్యటన..
- డిసెంబరులో మోదీ అమెరికాకు
( న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ )
అమెరికా–భారత్ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం 90 శాతానికి పైగా పూర్తయిందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. మిగిలిన కొద్దిపాటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చిన వెంటనే ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు ‘‘చాలా దగ్గరగా’’ వచ్చాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అధికారి చెప్పారు. దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాల్లో వాణిజ్యం ప్రధాన సమస్యగా కొనసాగుతోందని.. ఈ ఒప్పందం కుదిరితే అమెరికా–భారత్ సంబంధాలు మరో స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నారు.
‘త్వరలోనే చూస్తారు’
ఒప్పందం ఎప్పుడు కుదరొచ్చన్న ప్రశ్నకు అధికారి నేరుగా తేదీ చెప్పలేదు.‘‘వేచి చూడండి అని మేం ఎప్పుడూ చెబుతుంటాం. కానీ ఇప్పుడు 90 శాతానికి పైగా పూర్తయ్యింది. తుది అంశాలపై మాత్రమే పని జరుగుతోంది. కాబట్టి త్వరలోనే ఏదో ఒకటి చూస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.ఇరు దేశాల సంబంధాల్లో వాణిజ్యమే చాలా కాలంగా అతిపెద్ద అవరోధంగా ఉందని గుర్తుచేశారు. ఈ అడ్డంకి తొలగితే సంబంధాలు మరింత విస్తృతంగా బలోపేతమవుతాయని పేర్కొన్నారు.
రుబియో రాకతో మరింత ఊపు
అమెరికా–భారత్ సంబంధాల్లో వేగం పెంచే పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అధికారి తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అక్టోబరులో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరులో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.మోదీ పర్యటన సందర్భంగా ‘‘కొన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది’’ అని అధికారి పేర్కొన్నారు.అమెరికా–భారత్ భాగస్వామ్యంపై ఇరు దేశాల దృష్టి నిరంతరం పెరుగుతోందని.. సంబంధాల్లో ప్రస్తుతం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
క్వాడ్‌పై ప్రత్యేక దృష్టి
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ కూటమిలోనూ పరస్పర సమన్వయం పెరుగుతోందని అమెరికా అధికారి తెలిపారు.ఈ ఏడాది క్వాడ్ విదేశాంగ మంత్రులు మూడోసారి సమావేశం కానున్నారని చెప్పారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత తరచుగా సమావేశాలు జరగడం గతంలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు. క్వాడ్‌కు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యంతోపాటు భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ఈ వేదికకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా వచ్చే నెలలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు.
ఐమెక్‌కు పెద్దపీట
భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) కూడా అమెరికా, భారత్‌లకు అత్యంత కీలక ప్రాధాన్యమున్న ప్రాజెక్టేనని అధికారి తెలిపారు.మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిణామాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలో అవరోధాలు ఏర్పడ్డాయని చెప్పారు.ఇజ్రాయెల్–గాజా పరిణామాలు, ఆ తర్వాత ఇరాన్ ఘర్షణలు, అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ వంటి పరిణామాలు ఐమెక్ పనులను నిలిపివేశాయని వివరించారు.‘‘భారత్ వైపు, అమెరికా వైపు మేం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులే దీనికి ప్రధాన అవరోధంగా ఉన్నాయి. పరిస్థితులు స్థిరపడిన వెంటనే ఐమెక్ వేగం పుంజుకోవడాన్ని చూస్తారు’’ అని అధికారి పేర్కొన్నారు.
మార్గాలపై కసరత్తు
ఐమెక్పై అమెరికాకు ఎంతో ఆసక్తి ఉందని, ఇప్పటికే కొన్ని మార్గాలను గుర్తించే పనులు ప్రారంభమయ్యాయని అధికారి తెలిపారు. ముఖ్యంగా సముద్ర రవాణా, రోడ్డు మార్గాల ద్వారా సరకు రవాణాకు సంబంధించిన మార్గాలపై కసరత్తు జరుగుతోందన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ, ఇజ్రాయెల్ తదితర దేశాలు తమ తమ భాగస్వామ్య అంశాలను ఇంకా ఖరారు చేసుకోవాల్సి ఉందని చెప్పారు.వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరడం, క్వాడ్ కార్యకలాపాలు పెరగడం, ఐమెక్పై కసరత్తు మళ్లీ ఊపందుకోవడం.. మొత్తం మీద అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త పరిణామాలకు సంకేతాలుగా మారుతున్నాయి.
