Asia Cup | నేడే భారత్–పాక్ సమరం..
- సెమీస్ బెర్త్ ఖాయం..
- పాక్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్
- 14–3తో తిరుగులేని రికార్డు..
- ఆసియా కప్‌లోనూ 6–1తో పైచేయి
- దుబాయ్‌లో నేడు తుది లీగ్ పోరు..
- బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా హర్మన్‌ప్రీత్ సేన
దుబాయ్, ఆంధ్రప్రభ : మహిళల ఆసియా కప్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు.. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా మెరుగైన ప్రదర్శనతో పోటీ ఇవ్వాలని చూస్తోంది.
అయితే ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 17 సార్లు తలపడగా.. భారత్ ఏకంగా 14 విజయాలు సాధించింది. పాకిస్థాన్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఆసియా కప్ విషయానికి వస్తే ఇరు జట్లు ఏడు సార్లు తలపడగా.. ఆరు విజయాలు భారత్ ఖాతాలోనే ఉన్నాయి. పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలే దాయాదుల పోరులో భారత్ ఎంతటి ఆధిపత్యం కొనసాగిస్తోందో చెబుతున్నాయి. అయితే, క్రికెట్‌లో రికార్డులను పక్కన పెడితే, మైదానంలో ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారని, తాము ఏమాత్రం అలసత్వానికి లోనుకాకూడదని భారత జట్టు భావిస్తోంది.
సెమీస్ బెర్తు ఖరారైనా..
భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు ఆధిపత్య ప్రదర్శన కనబరిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను కూడా పూర్తి స్థాయి పోరుగా తీసుకోవాలని భావిస్తోంది. గత ఆసియా కప్ ఎడిషన్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. శ్రీలంక చేతిలో టైటిల్ కోల్పోయిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కీలక సాధనగా మారనుంది. సెమీఫైనల్‌కు ముందు జట్టులోని ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా చేయడం, బ్యాటర్లకు ఎక్కువ సమయం క్రీజులో గడిపే అవకాశం కల్పించడం టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న మరో లక్ష్యం.
మంధాన.. షెఫాలీ జోరుమీద
భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన అద్భుత శతకంతో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. రికార్డుల మోత మోగిస్తూ సాధించిన ఆ శతకం మిగతా జట్లకు గట్టి హెచ్చరికగా మారింది. మరోవైపు షెఫాలీ కూడా ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే సామర్థ్యం కలిగిన బ్యాటర్. దుబాయ్ పిచ్‌లపై బ్యాటింగ్ అంత సులభంగా ఉండటం లేదు. బంతి వేగాన్ని అంచనా వేసేందుకు బ్యాటర్లు ప్రారంభంలో కొన్ని బంతులు ఆడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను మంధాన, షెఫాలీ చక్కగా అర్థం చేసుకుని తమ ఇన్నింగ్స్‌లను నిర్మిస్తున్నారు.
మిడిలార్డర్‌కు పరీక్ష
ఓపెనర్లకు మంచి ఆరంభం లభిస్తున్నప్పటికీ.. మిడిలార్డర్‌లోని కొందరు బ్యాటర్లు ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నారు. ప్రతికా రావల్, రిచా ఘోష్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. సెమీఫైనల్ దశకు చేరుకున్న నేపథ్యంలో వీరికి పాకిస్థాన్‌పై మంచి ఇన్నింగ్స్ సాధించే అవకాశం లభించవచ్చు. నాకౌట్ మ్యాచ్‌లకు ముందు కీలక బ్యాటర్లందరూ ఫామ్‌లోకి రావడం భారత్‌కు ఎంతో అవసరం.
బౌలింగ్‌లో కొత్త ఊపు
భారత బౌలింగ్ విభాగంలోనూ సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. నందిని శర్మ పేస్ దళంలో చేరడం జట్టుకు అదనపు బలం అందిస్తోంది. ప్రధాన పేసర్ క్రాంతి గౌడ్‌తో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేస్తూ నందిని ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థి బ్యాటర్లపై ఆరంభంలోనే ఒత్తిడి పెంచేందుకు ఈ పేస్ జోడీ కీలకం కానుంది. ఆసియా స్థాయిలో భారత్ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే బలమైన జట్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి మ్యాచ్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
పాక్‌కు బ్యాటింగే సమస్య
పాకిస్థాన్ విషయానికి వస్తే.. ఆ జట్టు ప్రధాన సమస్య బ్యాటింగ్. థాయ్‌లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. చివరకు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. అయితే భారత్ వంటి బలమైన జట్టుపై ఇలాంటి ప్రదర్శన సరిపోదు. ఓపెనర్ మునీబా అలీ, కెప్టెన్ ఫాతిమా సనా వంటి కొద్దిమంది ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడటం పాకిస్థాన్‌కు ప్రతికూలంగా మారుతోంది. భారత బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే మిగతా బ్యాటర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
గత పోరులో భారత్‌దే పైచేయి
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ చివరిసారిగా 2024లో డంబుల్లాలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారత బౌలర్ల ధాటికి 108 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మతో పాటు రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్ పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. సిద్రా అమీన్ 35 బంతుల్లో 25 పరుగులతో ఆ జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసింది. అనంతరం భారత్ 35 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన కలిసి 85 పరుగుల భాగస్వామ్యంతో భారత విజయాన్ని సులభం చేశారు.
అయితే 2022 ఆసియా కప్‌లో పాకిస్థాన్ భారత్‌కు షాక్ ఇచ్చింది. నిదా దార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. అందుకే గణాంకాల్లో భారత్ స్పష్టమైన ఆధిపత్యంలో ఉన్నప్పటికీ.. పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయడానికి హర్మన్‌ప్రీత్ సేన సిద్ధంగా లేదు.
కప్పే లక్ష్యంగా భారత్
మహిళల ఆసియా కప్‌లో గతసారి తృటిలో చేజారిన టైటిల్‌ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. సెమీఫైనల్ బెర్తు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను కేవలం లీగ్ పోరుగా కాకుండా నాకౌట్‌కు ముందు కీలక సాధనగా ఉపయోగించుకోవాలని జట్టు భావిస్తోంది. మంధాన, షెఫాలీ ఫామ్‌ను కొనసాగించడంతో పాటు మిడిలార్డర్‌కు ఎక్కువ బ్యాటింగ్ సమయం ఇవ్వడం, బౌలింగ్ విభాగాన్ని మరింత పదును పెట్టడం భారత్ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు సెమీస్ అవకాశాల కోసం పాకిస్థాన్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ ఫలితంతో పాటు ఇరు జట్ల వ్యూహాలు, ఆటగాళ్ల ఫామ్‌పై కూడా ఆసక్తి నెలకొంది.
