Asian Games 2026 | పతకాల వేటకు భారత రేడీ..

  • 503 మంది బృందానికి ఘన వీడ్కోలు
  • 300 మందికి పైగా అరంగేట్ర ఆటగాళ్లు..
  • పతకాల వేటకు యువ సేన సిద్ధం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆసియా క్రీడల సమరానికి భారత క్రీడా బృందం సిద్ధమైంది. 20వ ఆసియా క్రీడలు ఐచి-నగోయా 2026, జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్, నగోయాలో సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగ‌నున్నాయి. ఆసియా క్రీడలు-2026కు వెళ్లనున్న 503 మంది సభ్యుల భారత బృందానికి న్యూఢిల్లీలో మంగళవారం ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి. ఉష, క్రీడల శాఖ కార్యదర్శి హరి రంజన్‌ రావు, భారత బృందం చీఫ్‌ డి మిషన్‌ సహదేవ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత బృందం అధికారిక జెర్సీని ఆవిష్కరించారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో మాండవీయ మాట్లాడుతూ.. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించి దేశ గౌరవాన్ని మరింత పెంచుతారన్న నమ్మకం తమ‌కు ఉందన్నారు. “క్రీడాకారుడి విజయం అతడికే కాదు.. దేశానిదీ. 503 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఆసియా క్రీడలకు వెళ్తోంది. మెరుగైన ప్రదర్శనతో తిరిగి వస్తామన్న పూర్తి విశ్వాసం ఉంది” అని మాండవీయ పేర్కొన్నారు.

300 మందికి పైగా అరంగేట్రం..

ఈసారి భారత బృందంలో యువ ప్రతిభకు పెద్దపీట పడింది. 503 మంది సభ్యుల్లో 300 మందికి పైగా క్రీడాకారులు తొలిసారి ఆసియా క్రీడల బరిలోకి దిగనున్నారు. దీంతో భారత క్రీడా రంగంలో కొత్త తరం ప్రతిభ ఎంతగా వెలుగులోకి వస్తోందో స్పష్టమవుతోంది. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులు కూడా బరిలోకి దిగనుండటంతో భారత్‌ పతకాల వేటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎంపికలో పారదర్శకత

క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా నిర్వహించినట్లు మాండవీయ తెలిపారు. బహిరంగ ఎంపిక పరీక్షలు, స్వతంత్ర పరిశీలకులు, కెమెరాల పర్యవేక్షణతో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు. 2026 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ 13 స్వర్ణ పతకాలు సాధించగా.. ఈసారి ఆ సంఖ్యలో 35 శాతానికి పైగా మెరుగుదల కనిపించిందని ఆయన తెలిపారు. ఆసియా క్రీడల్లోనూ భారత క్రీడాకారులు ఇదే జోరును కొనసాగించాలని ఆకాంక్షించారు.

2036 లక్ష్యంగా అడుగులు

2036 ఒలింపిక్స్‌ నిర్వహణే లక్ష్యంగా భారత్‌ క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని మాండవీయ తెలిపారు. ప్రపంచ క్రీడా వేదికపై భారత్‌ను అగ్రదేశాల సరసన నిలబెట్టేందుకు పదేళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.36 వేల కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయని అన్నారు.

దేశానికి ప్రాతినిధ్యం.. గర్వకారణం

భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి. ఉష మాట్లాడుతూ.. ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం బాధ్యతతో పాటు గొప్ప గౌరవమని అన్నారు. “క్రీడా ప్రయాణాన్ని కేవలం పతకాలతో మాత్రమే కొలవలేం.. కలలతోనూ కొలవాలి. మనం భారతదేశ ప్రతినిధులుగా వెళ్తున్నాం. ఇది బాధ్యతతో పాటు గర్వకారణం” అని ఉష పేర్కొన్నారు. ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం, క్రీడల శాఖ అందిస్తున్న నిరంతర సహకారానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలు–2026లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 300 మందికి పైగా కొత్త ఆటగాళ్ల అరంగేట్రంతో.. యువ శక్తి, అనుభవం కలగలిసిన భారత బృందం పతకాల వేటకు సిద్ధమైంది.