India-100-Percent-Tariff-Ihreat : 100 శాతం ముప్పు! Andhra Prabha Top News
India-100-Percent-Tariff-Ihreat : 100 శాతం ముప్పు! Andhra Prabha Top News
- భారత్ కు టారిప్ గండం
- రష్యా-ఇరాన్‌పై అమెరికా కొరడా
- అమెరికా కాంగ్రెస్ లో కీలక నిర్ణయం
- ట్రంప్‌కు భారీ టారిఫ్ అధికారాలు
- రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై
- అదనపు సుంకాలు.. జాబితాలో భారత్
- 214-211 ఓట్లతో బిల్లుకు ఆమోదం
- తుది ఓటింగ్‌కు రంగం సిద్ధం
(వాషింగ్టన్ , ఆంధ్రప్రభ ప్రతినిధి)
రష్యా, ఇరాన్‌లపై అమెరికా ఆంక్షల కొరడా మరింత బిగిసేలా కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించే అధికారాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కట్టబెట్టే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ మంగళవారం విధానపరమైన అడ్డంకిని అధిగమించింది. దీంతో బిల్లుపై తుది ఓటింగ్‌కు మార్గం సుగమమైంది.
‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన 214-211 ఓట్ల తేడాతో ముందుకు వెళ్లింది. ఇద్దరు డెమొక్రాట్లు—మైనేకు చెందిన జారెడ్ గోల్డెన్, వాషింగ్టన్‌కు చెందిన మేరీ గ్లూసెన్‌క్యాంప్ పెరెజ్—రిపబ్లికన్లకు అనుకూలంగా ఓటేశారు.
100 శాతం వరకు టారిఫ్!
బిల్లు ఆమోదమైతే.. రష్యా నుంచి ముడిచమురు, సహజవాయువు కొనుగోళ్లు కొనసాగించే కొన్ని దేశాల వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు దక్కుతుంది. అంతేకాదు.. రష్యా ఆర్థిక, ఇంధన రంగాలను లక్ష్యంగా చేసుకునే నిబంధనలతో పాటు ఇరాన్‌కు సంబంధించిన ఆంక్షలను మరింత విస్తరించే ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి.అంటే.. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై నేరుగా ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా తన మార్కెట్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట.
భారత్ పేరూ జాబితాలోనే..
ఈ ప్రతిపాదిత ‘సెకండరీ టారిఫ్’ నిబంధనలతో భారత్‌కు ప్రత్యేకంగా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. డెమొక్రాట్ స్టెనీ హోయర్ ప్రవేశపెట్టిన హౌస్ సవరణలో 100 శాతం వరకు టారిఫ్‌లకు గురయ్యే అవకాశం ఉన్న 10 దేశాల పేర్లను స్పష్టంగా పేర్కొన్నారు. ఆ జాబితాలో,, భారత్, చైనా, టర్కియేచ అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్,
కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, ఉన్నాయి.
రష్యా చమురు.. భారత్ కొనుగోళ్లు
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అంతర్జాతీయ మార్కెట్లలో రాయితీ ధరలకు చమురును విక్రయించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురును కొనుగోలు చేస్తూ వస్తోంది.ఇప్పుడు అమెరికా ప్రతిపాదిస్తున్న బిల్లు.. ఇలాంటి దేశాలపై అమెరికా మార్కెట్ ప్రాప్యతను ఒత్తిడికి సాధనంగా ఉపయోగించుకునేలా రూపొందుతోంది.అంటే రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తే.. అమెరికా మార్కెట్లోకి వచ్చే వస్తువులపై భారీ టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడొచ్చు.
ఇప్పటికే సెనేట్‌లో పాస్
ఈ బిల్లుకు అమెరికా సెనేట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఆగస్టులో జరిగిన ఓటింగ్‌లో 86-11 ఓట్లతో సెనేట్ బిల్లును ఆమోదించింది. వైట్‌హౌస్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. అదనపు టారిఫ్ అధికారాలను ఉపయోగించి రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచి.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే దిశగా మాస్కోను ఒత్తిడికి గురిచేయవచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఏం జరగనుంది?
ప్రతినిధుల సభలో జరిగిన తాజా ఓటింగ్ బిల్లుకు తుది ఆమోదం కాదు. ఇది తదుపరి చర్చలు, అసలు బిల్లుపై ఓటింగ్‌కు మార్గం సుగమం చేసే విధానపరమైన ముందడుగు మాత్రమే. ఇప్పుడు ప్రతినిధుల సభలో బిల్లుపై చర్చ, అనంతరం తుది ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. సభ ఆమోదిస్తే.. సెనేట్ ఇప్పటికే ఆమోదించిన బిల్లుతో సభ వెర్షన్‌లో ఏమైనా తేడాలున్నాయా అన్నది తదుపరి కీలక అంశంగా మారుతుంది.
డెమొక్రాట్ల అభ్యంతరం
ఈ ప్రతిపాదనకు హౌస్ డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్‌కు అతిగా విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడం వల్ల అమెరికా వినియోగదారులపైనే భారం పడే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు.మరోవైపు బిల్లుకు మద్దతు ఇస్తున్నవారు మాత్రం.. రష్యాపై, మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
భారత్ కు కొత్త సవాల్?
ఇప్పటివరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకుంటోంది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా టారిఫ్ చట్టంలో భారత్ పేరు స్పష్టంగా ప్రస్తావనకు రావడంతో.. రష్యా చమురు కొనుగోళ్లు, అమెరికా మార్కెట్ ప్రయోజనాల మధ్య సమతుల్యత భారత్‌కు కీలకంగా మారనుంది. బిల్లు తుది రూపంలో ఎలా ఆమోదం పొందుతుంది? భారత్‌పై పేర్కొన్న 100 శాతం వరకు టారిఫ్ అవకాశం ఏ రూపంలో అమలవుతుంది? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
