Day 4 Lunch : లార్డ్స్ వేదికగా భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మూడవ రోజు (డే 3) ముగిసే సమయానికి ఇరుజట్లూ సమాన స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్ ముగించగా, చివరి నిమిషాల్లో ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 2/0తో నిలిచింది. ఆ ఇన్నింగ్స్‌ను నేడు (డే 4) ఉదయం కొనసాగించిన ఇంగ్లాండ్… భారత్ బౌలింగ్ ధాటికి తేలిపోయింది.
భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 24 ఓవర్లలో కేవలం 96 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 98/4తో నిలిచింది. మిగిలిన సెషన్లలో గణనీయమైన రెండో ఇన్నింగ్స్ స్కోరు సాధించాలంటే ఇంగ్లాండ్ మిడిలార్డర్, లోయర్ మిడ్ ఆర్డర్ బ్యాటర్లు పెద్ద బాధ్యత వహించాలి.
భారత్ దూకుడు.. ఇంగ్లాండ్ టాపార్డ్ ఫట్ !
ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లు నేటి ఇన్నింగ్స్ ని కొనసాగిస్తూ బరిలోకి దిగారు. అయితే, పిచ్‌లోని అసమానతలతో జాగ్రత్తగా ఆడటం కష్టంగా మారడంతో వీరిద్దరూ ఆగ్రసివ్ షాట్లతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డకెట్ 12 పరుగులు చేసి వేగంగా ఆడినా, ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 22 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అక్కడితో ముగిసింది.
డకెట్ అవుట్ అయిన వెంటనే ఒల్లీ పోప్ మూడో స్థానంలో వచ్చాడు. కానీ క్రీజ్‌లో స్థిరపడలేకపోయి, డ్రింక్స్ విరామానికి సిరాజ్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ అవుతూ నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు.
ఇక ఓపెనర్ క్రాలీకి జోడీగా జో రూట్ క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే క్రాలీ 22 పరుగులు చేసి కొంతకాలం నిలిచినా, అజాగ్రత్తగా షాట్ ఆడి నితీశ్ కుమార్ రెడ్డీకి క్యాచ్ ఇచ్చి 15వ ఓవర్లో అవుట్ అయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ స్కోరు ఆ సమయానికి 50/3కి పడిపోయింది.
ఆ తర్వాత హ్యారీ బ్రూక్ రూట్‌కి జతకట్టి భారత బౌలర్లను ఎదుర్కొని కొంత వేగంగా ఆడాడు. 19 బంతుల్లో 23 పరుగులు చేసి కొంత ఉత్సాహం ఇచ్చినా, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
తరువాత కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్‌కి వచ్చి రూట్‌కి జతకట్టి నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నించాడు. లంచ్ సమయానికి రూట్ 17 పరుగులు, స్టోక్స్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 98/4గా కొనసాగుతోంది.