IND vs ENG – Lord’s Test | ఇంగ్లండ్ – భారత్ స్కోర్లు సమం

Day 3 stumps : లార్డ్స్ మైదానంలో భార‌త్ – ఇంగ్లాండ్ మ‌ధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఉత్కంఠకరంగా మారింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లండ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా, దీనికి ప్రత్యుత్తరంగా బ‌రిలోకి దిగిన‌ భారత్‌ కూడా అదే స్కోరు (387) చేసి ఆలౌట‌య్యింది. ఫలితంగా ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు సమంగా ముగిశాయి.

భార‌త్ ఆలౌట‌వ్వ‌డంతో.. ఈరోజు (డే 3) చివరి సెషన్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కేవలం ఒక ఓవర్ మాత్రమే ఆట జరిగ్గా.. ఇంగ్లండ్ 2 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఓపెనర్లు జాక్ క్రాలీ (2), బెన్ డకెట్ రేపు ఆట కొన‌సాగించ‌నున్నారు.

రెండో రోజు లంచ్ త‌రువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తక్కువ స్కోర్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ స‌మ‌యంలో క్రీజులో నిలిచిన కెఎల్ రాహుల్ (177 బంతుల్లో 100) శతకం సాధించి నిలకడ ఇచ్చాడు. ఈ క్లాసిక్ నాక్ తో లార్డ్స్ హానర్స్ బోర్డు పై రాహుల్ పేరు రెండోసారి రాసుకున్నాడు.

రాహుల్‌కి మంచి తోడుగా నిలిచిన‌ రిషభ్ పంత్… తన చేతి వేలి గాయంతో 74 ప‌రుగులు సాధించాడు. రాహుల్‌తో కలసి నాల్గో వికెట్‌కి 141 పరుగుల భాగస్వామ్యం చేయ‌గా.. లంచ్‌కు ముందు పంత్‌ను బెన్ స్టోక్స్ డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు. లంచ్ త‌రువాత సెంచరీ పూర్తిచేసిన‌ రాహుల్.. వెంటనే షోయబ్ బషీర్‌కి వికెట్ ఇచ్చాడు.

ఆ తర్వాత రవీంద్ర జడేజా 131 బంతుల్లో 72 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. నితీశ్ కుమార్ రెడ్డి (30), వాషింగ్టన్ సుందర్‌ (23)లతో రెండు అర్ధ శతక భాగస్వామ్యాలు కుదుర్చాడు. దాంతో భారత్ ఇంగ్లండ్ స్కోర్ సమం చేయగలిగింది.

సాయంత్రం సెషన్‌ ప్రారంభంలోనే స్టోక్స్ (2/62) నితీశ్‌ను ఔట్ చేసి దూకుడు పెంచాడు. క్రిస్ వోక్స్ (3/84) జడేజా, బుమ్రాలను అవుట్ చేయగా.. జోష్ కార్స్ (1/88), జోఫ్రా ఆర్చర్ (2/52) తుదివరకు మిగిలిన వికెట్లు తీయడంతో భారత్‌కి తక్కువ లీడ్‌ కూడా దక్కలేదు.

తాజా పరిస్థితుల్లో ఇరు జట్లు సమంగా ఉండడంతో, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుందా అని క్రికెట్ అభిమానుల్ని ఉత్కంఠలో రేపుతుంది.

Leave a Reply