Imprisonment | దోషికి 20ఏళ్ల జైలు శిక్ష
Imprisonment | తిరుపతి ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఎనిమిదేళ్ల క్రితం మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఆమెను వేధిస్తూ కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసిన భర్తకు ఇవాళ 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష (20years rigorous imprisonment) విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్టు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రకటించింది.
ఆ వివరాల ప్రకారం… సూళ్లూరుపేట మండలం (Sullurpet Mandal), జంగాలగుంట గ్రామంలో 2017 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో పులి మునుస్వామి అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్య పులి మౌనికను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఆమెపై దాడి చేసి , ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 4వ తేదీన తెల్లవారుజామున ఆమె మృతిచెందింది. ఈ మేరకు నమోదు చేసిన కేసులో జిల్లా పోలీసులు సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరించి, నేరాన్ని కోర్టులో రుజువు చేయడంలో విజయం సాధించారు.
ప్రాసిక్యూషన్ తరపున సమర్పించిన ఆధారాలను పరిశీలించిన 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ఎం.సోమశేఖర్ నిందితుడు మునుస్వామిని దోషిగా నిర్ధారిస్తూ 20సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2,000ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.కే.రఫీ మాలిక్ వాదనలు వినిపించారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు (SP L. Subbaraidu) దర్యాప్తు, ప్రాసిక్యూషన్, కోర్టు లైజనింగ్ ద్వారా నేరస్థుడికి కఠిన శిక్ష పడేలా చేసిన అప్పటి సీఐలు విజయ్ కృష్ణ, కిషోర్ బాబు, ప్రస్తుత సీఐ మురళీ కృష్ణ, కోర్టు హెడ్ కానిస్టేబుల్ షేక్ ఖాజా హుస్సేన్, కోర్టు లైజన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, నాయుడుపేట డీఎస్పీ శ్రీ చెంచుబాబులను ప్రత్యేకంగా అభినందించారు.

