Friday, November 22, 2024

జొమాటో వర్సెస్‌ రెస్టారెంట్స్‌.. కొత్త విధానం అమలుపై కీలక నిర్ణయం..

ఆహార నాణ్యత విషయంలో రెస్టారెంట్లపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆహార నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను నిషేధిస్తామని చెప్పిన జొమాటో.. కొత్త విధానాన్ని అమలు చేసే విషయంలో కీలక ప్రకటన చేసింది. 18వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాల్సిన ఈ విధానాన్ని మే 3కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అయితే జొమాటో తీసుకొచ్చిన సరికొత్త విధానంపై జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే జొమాటో కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. ఆహార నాణ్యత విషయంలో తాము తీసుకొచ్చిన విధానంపై అభిప్రాయాలు, సూచనలు చేయాలని సూచించింది. దీనికి ఏప్రిల్‌ 22న తుది గడువుగా విధించింది.

ఆయా రెస్టారెంట్ల విషయంలో వస్తున్న ఫిర్యాదుల కారణంగానే ఈ విధానం తీసుకురావాల్సి వచ్చిందని, దీన్ని అమలు చేస్తే ఆర్డర్లు పెరుగుతాయని, దీనికితోడు ఫిర్యాదులు తగ్గుతాయని జొమాటో అభిప్రాయపడింది. ఫిర్యాదులకు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉందని, లేనిపక్షంలో జొమాటోతో పాటు ఆయా రెస్టారెంట్లపై నమ్మకం పోతుందని సముదాయించే ప్రయత్నం చేసింది. ఆయా రెస్టారెంట్లపై వస్తున్న ఫిర్యాదుల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే రెస్టారెంట్లతోనే పని చేస్తామని, నిబంధనలు పాటించని వాటిని తాత్కాలికంగా యాప్‌ నుంచి తొలగించేస్తామని జొమాటో తేల్చి చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement