హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా మహమ్మారి దశలవారీగా విరుచుకుపడుతూ ముప్పుతిప్పలు పెడుతున్న సమయంలో ప్రజలను జికా వైరస్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. తెలంగాణతోపాటు దేశంలోని 13 రాష్ట్రాల్లో జికా వైరస్ కేసులు వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేలింది. పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందని, జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. మొత్తం 1475 నమూనాలను పరిశీలించగా వాటిలో 67 నమూనాల్లో జికా వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో 86శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉండగా… 13శాతం మంది ఆసుపత్రిలో చేరినట్లు గుర్తించారు. జికా వైరస్ తెలంగాణతోపాటు ఢిల్లిd, ఝార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఓ నమూనాలో జికా వైరస్ నిర్ధారణ అయింది. ఉస్మానియా మెడికల్ కాలేజీతోపాటు హైదరాబాద్‌లోనూ ఈ తరహా కేసులు నమోదైనట్లు సమాచారం.
జికా వైరస్ ప్రధానంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, శరీరంపై దుద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు బహిర్గతమవుతాయి. జికా కూడా డెంగీ లానే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసిందది. జికాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన పరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి నుంచి బిడ్డకు సోకి మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మానసికంగా చిన్నారులను బలహీనం చేసే శక్తి జికాకు ఉందని హెచ్చరించారు. అయితే జికాకు ఇప్పటి వరకు నిర్ధిష్టమైన చికిత్స విధానం లేకపోవడంతో వైరల్ జలుబుకు ఇచ్చిన చికిత్సనే జికా కేసులకు చేస్తున్నారు. జికా వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.