కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్ ప్రబలింది. బెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్‌లో ప్రాణాంతక జికా వైరస్ బయటపడింది. దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాప్తి చెందింది. అనంతరం చిక్కబళ్లాపూర్ జిల్లాలోని దోమల్లో జికా వైరస్ గుర్తించారు. దీంతో జికా వైరస్ వ్యాప్తిపై ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన మొత్తం 100 శాంపిల్స్‌లో ఆరు చిక్కబళ్లాపూర్‌కు చెందినవేనని, అందులో ఐదుగురు నెగిటివ్ కాగా, ఒకరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని చిక్కబళ్లాపూర్ జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్‌వో) ఎస్‌ఎస్ మహేష్ తెలిపారు. మరో 30 మంది గర్భిణులు, జ్వరం లక్షణాలతో ఏడుగురి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పంపామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని మహేశ్ తెలిపారు.
వరుసగా మూడు రోజులుగా జ్వరం ఉన్న వారు ముందుకు వచ్చి రక్త నమూనాలను అందించాలని వైద్యులు కోరారు. చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఏడెస్ దోమలు సోకిన దోమలు గుర్తించిన గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలో సర్వే ప్రారంభించినట్లు డీహెచ్‌ఓ తెలిపారు. జికా లక్షణాలు డెంగీ జ్వర లక్షణాల మాదిరిగానే ఉంటాయని వైద్యాధికారులు చెప్పారు. జికా వైరస్ వెలుగుచూసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.