ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. శుక్రవారం దేశం విడిచి వెళ్లినట్టు రష్యా మీడియా పలు కథనాలు ప్రసారం చేసింది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్‌లో జెలెన్ స్కీ తలదాచుకున్నట్టు రష్యా మీడియా తెలిపింది. అయితే ఇంతకు ముందు కూడా జెలెన్ స్కీ దేశం విడిచిపెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశాడు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నట్టు వీడియో ద్వారా స్పష్టం చేశారు. మరీ తాజాగా రష్యా ప్రసారం చేస్తున్న కథనాల్లో ఎంత వరకు నిజం ఉందో తేలాల్సి ఉంది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని అంతం చేసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జెలెన్ స్కీను హత్య చేసేందుకు మూడు సార్లు ప్రయత్నించినట్టు సమాచారం. దేశం విడిచి వచ్చేయాలని, రక్షణ కల్పిస్తామని అగ్ర రాజ్యాలు ఆహ్వానం పలికినా.. జెలెన్ స్కీ సున్నితంగా తిరస్కరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేసిన విన్నపానికి నో చెప్పారు. యుద్ధ భూమిలోనే ఉంటూ.. సైనికుడిగా మారిపోయారు.