హైదరాబాద్, ఆంధ్రప్రభ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగానే రేపటి (శుక్రవారం) నుంచి మహిళా ప్రయాణికులకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.
మహిళలకు జీరో టికెట్ల జారీపై ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీ-వల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పథకం అమలవుతోందని ఆయన తెలిపారు. అయితే ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాప్ట్nవేర్‌ను సంస్థ అప్డేట్ చేసిందని పేర్కొన్నారు.
సాప్ట్nవేర్‌ను టిమ్ మెషిన్లలో ఇన్స్టాల్ చేస్తున్నామని, మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందని సంస్థ ఎండీ పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని కోరారు. ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని కోరారు.
మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్‌ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ముని శేఖర్, సిటీఎం జీవన్ ప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, ఐటీ ఏటీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.