సార్వత్రిక ఎన్నికలు తొలి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. బెంగాల్, మణిపుర్‌లలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. అయితే, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు.
నాగాలాండ్‌లో ఆరు జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన వారున్నారు. రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా.. ఈ ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఉన్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించినప్పటికీ.. ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకురాలేదు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రత్యేక రాష్ట్రం కోసం..
ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తూ నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO)గా ఏర్పడి తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యిందని చెబుతోన్న ఈఎన్‌పీవో.. ఏప్రిల్ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్ పాటించాలని ప్రకటించింది. దీంతో పోలింగ్ రోజున లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు.