రష్యాతో చర్చించేందుకు వేదికను నిర్ణయించే అధికారాన్ని పుతిన్‌కే విడిచిపెడుతున్నామని ప్రకటించిన మాట వాస్తవమే అని ఉక్రెయిన్ తెలిపింది. అయితే.. బెలారస్లో చర్చలు జరిపితే తాము రామని ఖరాఖండీగా చెప్పిన ఉక్రెయిన్.. ఆ తరువాత మనసు మార్చుకుంది. బెలారస్.. రష్యాకు మిత్ర దేశమని, తమపై దాడులకు తెగబడే ముందు.. అక్కడే మిలిటరీ డ్రిల్స్ చేపట్టిందని జెలెన్ స్కీ తొలుత విమర్శించారు. ఇదే సమయంలో పుతిన్ ఓ కీలక ప్రకటన చేశారు. చర్చల విషయంలో జెలెన్ స్కీ సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రష్యన్ సైన్యాన్ని ప్రత్యేక పోరాటం కోసం సిద్ధం చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్‌ను పుతిన్ ఆదేశించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే.. బెలారస్లో రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెలారస్‌కు వచ్చేది లేదన్న ఉక్రెయిన్.. పుతిన్ కీలక ప్రకటనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. క్షిపణులు ఎగురుతున్న చోట చర్చలేంటి అని జెలెన్ స్కీ తొలుత మండిపడ్డారు.
తొలుత బెలారస్‌పై విముఖత..
బెలారస్‌లోని గోమెల్‌కు బదులుగా వార్సా, బ్రాటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్, బాకు వంటి నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా తీసుకోవాలని తొలుత జెలెన్ స్కీ సూచించారు. చివరికి గోమెల్‌కు వెళ్లేందుకు ఉక్రెయిన్ అంగీకరించింది. అప్పటికే రష్యా ప్రతినిధుల బృందం బెలారస్ చేరుకుంది. ఆ వెంటనే ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం కూడా బెలారస్‌కు బయలుదేరి వెళ్తున్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. ఇరు దేశాల బృందాలు గోమెల్లో శాంతి చర్చలు నిర్వహిస్తాయి. ఉక్రెయిన్ చర్చలకు అంగీకరించినప్పటికీ.. ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలను రష్యా సైనికులు హస్తగతం చేసుకున్నారు. యుద్ధంతో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. ఉక్రెయిన్ వాసులు.. తమ ఇళ్లు వదిలి ప్రాణ భయంతో పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఈ పరిస్థితుల్లో చర్చలకు తాము సిద్ధం అని జెలెన్ స్కీ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..